మీరొస్తారని..గెలిపిస్తారని..! | - | Sakshi
Sakshi News home page

మీరొస్తారని..గెలిపిస్తారని..!

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

● ఇతర ప్రాంతాల ఓటర్లకు ఫోన్లు

● నేడు జిల్లాలోని 221 గ్రామ

పంచాయతీల్లో తొలివిడత ఎన్నికలు

● నేడే రాజాం మున్సిపల్‌ ఎన్నికలు

బావగారూ..బాగున్నారా? మన ఊరి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. మీరేమో ఊరిలో లేరు. ఈ నెల 26న పోలింగ్‌ రోజు తప్పకుండా రావాలి. మీ ఓటు మాకే వేయాలి. కావాలంటే రానుపోను ప్రయాణ ఖర్చులు భరిస్తా.

– విశాఖలో నివాసముంటున్న వారికి ఫోన్‌లో ఓ సర్పంచ్‌ అభ్యర్థి విజ్ఞప్తి’

సార్‌! నేను మన వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నా. మీ ఇంటికి వెళ్లి అమ్మనాన్నలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. మీరు నిండు మనసుతో దీవించడమే కాదు. ఎంత బిజీగా ఉన్నా పోలింగ్‌ రోజున రావాలి. చిన్నప్పటి నుంచి నేను మీ మధ్య పెరిగా.

– విజయవాడలో ఉంటున్న వారికి ఫోన్‌లో ఓ కౌన్సిలర్‌ అభ్యర్థి విజ్ఞప్తి

విజయనగరం:

ఓ వైపు పంచాయతీ..మరో వైపు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామంలో చూసినా.. ఏ వార్డులో పరిశీలించినా అభ్యర్థుల ప్రచార శిబిరాలే కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పుర, పరిషత్‌ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కొందరు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కొందరు అభ్యర్ధులు రెండంకెల ఓట్లతోనే ఓటమి పాలయ్యారు. ఇలాంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ఇంటింటా తిరుగుతూ కుశల ప్రశ్నలు వేయడమే కాదు.. ఊళ్లో లేని వారి కోసం ఆరా తీస్తున్నారు. అన్నయ్య, తమ్ముడు, వదిన ఇలా వరసలు కలుపుతూ మీరు ఎక్కడున్నా ఓటేయడానికి తప్పక రావాలని ఆప్యాయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

● ప్రయాణ ఖర్చులు భరిస్తాం

ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, బెంగళూరు వంటి నగరాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. రాకరాక అవకాశం వచ్చిందని, ప్రయాణ ఖర్చులు చూసుకుంటామని చెబుతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ మూడు విడతలకు పూర్తయింది. ఈనెల 26న మొదటి విడతలో బొబ్బిలి, ఎస్‌కోట నియోజకవర్గాల పరిధిలో గల 8 మండలాల్లోని 221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 308 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలో 9 మండలాల పరిధిలోని 244 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. 26న రాజాం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఉపాధి కోసం వలసవెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్ధులు తలమనకలయ్యారు.

ఉదయం నుంచే ప్రచారం

అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పొలం పనులు, ఇతర విధులకు వెళ్లక ముందే అనుచరులతో ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూలికి వెళ్లే మహిళలను బృందాలుగా విభజించి కొద్దో గొప్పో సమర్పించి వెంట తీసుకెళ్తున్నారు. ఉదయం ప్రచారానికి సంబంధించి విశ్లేషించుకుని సాయంత్రం ఎటువైపు వెళ్లాలి? ఎలా నిర్వహించాలో అభ్యర్థులు సమాలోచన చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రంతో మొదటి ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ప్రచారానికి ముగింపు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement