● ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు
● భోజనాలు లేక ఆందోళనకు దిగిన
ఉద్యోగులు
● ఆర్వోలకూ అందని భోజనం
బొబ్బిలిరూరల్:
మారుమూల ప్రాంతాల నుంచి వందల కిలో మీటర్ల ప్రయాణం. ఎన్నికల విధుల నిర్వహణకు ఉదయం 7 గంటలకు ఇళ్లనుంచి బయలు దేరిన ఉద్యోగులకు మధ్యాహ్నం 3 గంటలైనా భోజనాలు సర్దుబాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలైమైంది. అంతవరకు ఎక్కడ,ఏ ప్రాంతానికి విసిరేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ తమ పేరు పిలిచేవరకు ఎంపీడీఓ ఆఫీస్ చెట్లకింద, వరండాల్లో నిల్చుని వేచిచూసిన సిబ్బందికి విధులు కేటాయించే సమయంలో మధ్యాహ్న భోజన విరామ సమయం దాదాపు రెండు గంటలైంది. కడుపు నకనకలాడుతుండగా అంతా ఒక్కొక్కరుగా ప్లేట్లు పట్టుకుని లైన్‌లో నిలుచుని ఉన్నారు. ఇంతలో అంతా అయిపోయిందని వడ్డించే వారు చెప్పడంతో హతాశులయ్యారు.ఈ సమయంలో మాకెక్కడ భోజనం దొరుకుతుందని అధికారులపై కేకలు వేశారు. డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. కడుపు మంటతో విధులు ఎలా నిర్వహించగలమంటూ అందోళన వ్యక్తం చేశారు. విజయనగరం, చీపురుపల్లి, మెరకముడిదాం తదితర సుదూర మండలాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం నిర్వాకమంటూ ఎంపీడీఓపై మండిపడ్డారు.
ఆర్వోలది ఆదేదారి
గురువారం జరగనున్న సర్పంచ్ ఎన్నికలు ఎలా నిర్వహించాలి? అభ్యర్థుల గుర్తులు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై దాదాపు 44 మంది ఆర్వోలకు ఎంపీడీఓ ఆఫీస్ మేడపై శిక్షణ ఇస్తున్నారు.ఇంతలో మధ్యాహ్నం 3 గంటలైంది. వారు కంగారుగా ప్లేట్లు పట్టుకుని లైన్‌లో ఉన్నారు.కానీ అప్పటికే లైన్‌లో ఉన్న సిబ్బంది ఉన్న విషయాన్ని వివరించడంతో వారు తెల్లమెహం వేశారు. ఇవేం బాధలని, భోజన సదుపాయమే కల్పించకపోతే రేపు పోలింగ్ రోజున పట్టించుకునే వారెవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తగినన్ని ఏర్పాట్లు చేశాం
800 మంది ఎన్నికల సిబ్బంది హాజరవుతున్నారని సమాచారం రావడంతో 1050 మందికి భోజనాలను కేటరింగ్‌కు అప్పగించాం. మరో 150 మంది పోలీసులకు భోజన ఏర్పాట్లు చేశాం. ఎన్నికల సిబ్బందితో పాటు తోడుగా వచ్చిన వారు కూడా భోజనాలు చేసి ఉండవచ్చని,అందువల్ల లోటు వచ్చిందని ఎంపీడీఓ రవికుమార్ చెప్పకొచ్చారు.
ఆర్డీఓ సమీక్ష
ఈ విషయం తెలుసుకున్న ఆర్డీఓ జేవీవీఎస్ రామ్మోహనరావు హుటాహుటిన ఎంపీడీఓ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఎంపీడీఓ రవికుమార్, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సుబ్బారావులతో సమీక్ష చేశారు. వెంటనే భోజనాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


