● డిసెంబర్ 1, 2 తేదీల్లో విజయనగరంలో రాష్ట్రస్థాయి టోర్నమెంట్
● ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి
విజయనగరం: దివ్యాంగ క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయాలనే లక్ష్యంతో విజయనగరం జిల్లాలో డిసెంబర్ 1, 2 తేదీల్లో పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాం సుందర రెడ్డి తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ విజయనగరం, ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.రాంసుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దివ్యాంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడలు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లో 13 సంవత్సరాలు పైబడిన దివ్యాంగ క్రీడాకారులు పాల్గొనేందుకు అర్హులుగాపేర్కొన్నారు. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారాటేబుల్ టెన్నిస్, పారా తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్ తదితర ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారన్నారు. ప్రచార పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సహా య సంచాలకురాలు జి. చంద్రిక, స్టేట్ పారా గేమ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


