విజయనగరం అర్బన్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఐఐఎల్‌ఎస్‌జీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి హాజరయ్యారు. 1926లో స్థాపించిన ఏఐఐఎల్‌ఎస్‌జీ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 సెప్టెంబర్ నుంచి 2026 నవంబర్ వరకు దేశంలోని వివిధ నగరాల్లో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి 27 వరకు ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. సదస్సులో దేశవిదేశాలకు చెందిన మేయర్లు, ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పట్టణాభివృద్ధి నిపుణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ బాలస్వామి హాజరు కావడంతో అంతర్జాతీయ వేదికపై విజయనగరం నగరానికి ప్రాతినిధ్యం లభించింది.
తోటల్లో కూటమి నేతలు ?
● ఓ రిసార్ట్‌లో వారంరోజులుగా మకాం
రాజాం: రాజాం మున్సిపల్ ఎన్నికల రెండో ఘట్టం ముగిసింది. అభ్యర్థుల ప్రచారాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. పట్టణ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ వేవ్ అధికంగా ఉండడంతో వార్డు కౌన్సిలర్ సీట్లకోసం అభ్యర్థులు పోటీపడ్డారు. పట్టణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రచారం అన్ని వార్డుల్లో ఇంటింటికీ చేరింది. సార్వత్రిక ఎన్నికలను మించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పక్కా ప్రణాళికలతో అడుగులు వేయడం, కూటమి అరాచకాలపై వ్యతిరేకత ఉండడంతో చైర్‌పర్సన్ పదవి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి దక్కుతుందనే సర్వేలు అధికమయ్యాయి. దీంతో కూటమిలో ఆత్రుత ప్రారంభమైంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని తాపత్రయ పడుతోంది.
రిసార్ట్‌లో పంచాయితీలు..
తోటల్లో మంతనాలు
రాజాం పట్టణానికి సమీపంలో ఓ రిసార్ట్‌లో కూటమికి చెందిన జిల్లా నేతలు వారం రోజులుగా మకాం వేశారు. పలువురు బలమైన వైఎస్‌ఆర్ సీపీ నేతలకు ప్రలోభాలు పెట్టారు. బ్లాక్‌మెయిలింగ్ చేశారు. ఎంతకీ తగ్గకపోతే వారి వ్యాపారాలు, ఆస్తులపై దాడులు చేయించారు. ఇంత జరిగినా ఏ ఒక్క వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్ అభ్యర్థి వెనుకడుగువేయలేదు. అన్నింటిని తట్టుకుంటూ విజయవంతంగా ప్రచార ఘట్టాన్ని ముగించారు. వైఎస్సార్‌సీపీ ప్రచార జోరును ఆపేందుకు రెండురోజులుగా కూటమినేత ఒకరు రాజాంతో పాటు చుట్టుపక్కల వివాదాస్పద వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం, పలుతోటల్లో సంప్రదింపులు చేయడంతో రాజాం పట్టణానికి ఏదో ముప్పు పొంచిఉందని పలువురు ఓటర్లు భావిస్తున్నారు.
ఓటింగ్‌శాతాన్ని తగ్గిస్తారా?
రాజాంలో మేథావులు, విద్యావంతులు, వ్యాపారులు, ఉద్యోగులు అధికంగా ఉన్నారు. వీరంతా ఇక్కడ ఇటీవల జరిగిన భూ దోపిడీలు, వ్యాపార దోపిడీలు, అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్‌లపై విసుగుచెంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిరంతరం ప్రజల్లో ఉండే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పాలవలస పద్మావతికి పట్టంకట్టే యోచనలో పడ్డారు. ఈ ఓటింగ్‌శాతం అధికంగా ఉంటే కూటమికి ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. దీంతో ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు పలు వార్డుల్లో కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలింగ్‌రోజు తమకు అనకూలంగా లేని కేంద్రాలతో పాటు తమకు రిగ్గింగుకు అవకాశంగా ఉండే కేంద్రాల్లో ఓటింగ్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈనెల 26న జరిగే పోలింగ్‌లో బూతుల్లోని ఏజెంట్లు గట్టిగా వ్యవహరించడంతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది.


