విజయనగరం టౌన్: జిల్లాలో మొదటి విడతలో బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, వేపాడ మండలాల్లోని వివిధ గ్రామ పంచాయతీలకు, రాజాం మున్సిపల్ కార్పోరేషన్‌కు ఈ నెల 26న గురువారం ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ ఏఆర్‌దామోదర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎనిమిది మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలకు, రాజాం మున్సిపల్ కార్పోరేషన్‌కు మొదటి విడతలో ఎన్నికలు 26న గురువారం జరుగుతున్నాయన్నారు. ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన భద్రత చర్యలు చేపట్టడంతో పాటు, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1805 పోలింగ్ కేంద్రాల్లో , 362 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గానూ, 559 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా, 884 నార్మల్ పోలింగ్ కేంద్రాలకు గుర్తించామన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ నిర్వహిస్తామని, రెండు గంటలకు అదే కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. బందోబస్తు నిమిత్తం సుమారు 1600 మంది పోలీసులను వినియోగిస్తామన్నారు. ఎనిమిది మండలాల్లో 71 రూట్ మొబైల్స్ ఉంటాయన్నారు. వాటికి అదనంగా 16 స్ట్రైకింగ్ ఫోర్స్, 16 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, 4 జోనల్ స్ట్రైకింగ్ పోర్సు ఉన్నాయన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే విధంగా ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్‌కు ఎస్కార్ట్ చేసుకుని, పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పోలింగ్ సజావుగా జరగాలి
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో సుద్దతో మార్కింగ్ చేసుకోవాలని, వందమీటర్ల పరిధిలో ఓటింగ్ చేసే వ్యక్తులను మినహాయించి , మిగిలిన వ్యక్తులను బయటనే నిలిపివేయాలన్నారు. బందోబస్తు నిర్వహించే ప్రతి పోలీసు సిబ్బంది తప్పనిసరిగా తమ వెంట లాఠీ, విజిల్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం లేదా బెల్ హెల్లర్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రజలెవరూ గుంపులుగా ఉండకుండా చూడాలని, సెక్షన్ 30 పోలీసు చట్టం, 144 సీఆర్‌పీసీ, 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమల్లో ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులను అంకితభావంతో నిర్వహించాలని, సంయమనంతో వ్యవహరించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.


