● రాష్ట్ర ఎన్నికల కమిషనర్
అనిల్ చంద్ర పునేఠా
విజయనగరం రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ రికార్డింగులను కనీసం 60 రోజుల పాటు లేదా ఎన్నికల పిటిషన్ల పరిష్కారం పూర్తయ్యే వరకు భద్రపరచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున్ మాట్లాడుతూ, ఈ సారి వార్డు సభ్యుల స్థానాల సంఖ్య అధికంగా ఉన్నందున గత ఎన్నికలతో పోలిస్తే కౌంటింగ్ టేబుళ్ల సంఖ్యను కనీసం రెండు నుంచి మూడు రెట్లు పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లకు బదులుగా సీరియల్ నంబర్లు, గుర్తులు మాత్రమే ఉంటాయని, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన వెంటనే సీరియల్ నంబర్లు, గుర్తుల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు విడతలుగా నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో ఆయా పోలింగ్ తేదీల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని కార్మికశాఖ ఉప కమిషనర్ టి.సుజాత కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ కిరణకుమార్, డీపీఓ మల్లిఖార్జునరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
భూ పరిపాలన పనుల్లో వేగం పెంచాలి
● రీసర్వే, పాస్ పుస్తకాలు, మ్యుటేషన్‌పై సీసీఎల్‌ఏ సమీక్ష
● జేసీ సేతుమాధవన్
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో భూ పరిపాలనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి అధికారులకు సూచించారు. భూముల రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్, 22ఏ భూముల జాబితా సవరణ, తదితర అంశాలపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సమావేశానికి జేసీ ఎస్.సేతుమాధవన్ తన ఛాంబర్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 383 గ్రామాలకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌లో 285 గ్రామాల వివరాల నమోదు పూర్తయినట్టు అధికారుల వివరించారు. ఫేజ్–5 రీసర్వేలో భాగంగా 99 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తికాగా, ఫేజ్–6లో 103 గ్రామాలకు గాను 47 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన గ్రామాల్లో రీసర్వే పనులు వేగంగా పూర్తిచేయాలని సమీక్షలో సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సాహివాల్ దూడ జననం
రామభద్రపురం: ఐవీఎఫ్ ఎంబ్రో టెక్నాలజీ విధానంలో జిల్లాలో మొట్టమొదటిగా సోంపురం గ్రామంలో కొరిపల్లి సత్యనారాయణకు చెందిన సంకరజాతి జెర్పీ ఆవు సోమవారం సాహివాల్ ఆడదూడకు జన్మనిచ్చినట్టు రామభద్రపురం మండల పశువైద్యాధికారి అప్పలనాయుడు తెలిపారు. పాడిఆవుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 7 రోజుల వయసు గల సెక్స్ సార్ట్‌టెడ్ ఆడ సాహివాల్ పిండం ట్రాన్స్‌ఫర్ చేశారు. 9 నెలల 10 రోజులకు దేశవాలీ సాహివాల్ ఆడదూడ జన్మించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడదూడల అభివృద్ధిలో ఇదో మైలురాయిగా పేర్కొన్నారు. రూ.ఐదువేల ఖర్చుతో ఐవీఎఫ్ విధానంలో పశువులకు మేలైన కృత్రిమ గర్భధారణ చేస్తున్నట్టు వెల్లడించారు.


