సాక్షి ప్రతినిధి, విజయనగరం:
చీకటి పడింది. ఎముకలు కొరికే చలి. ఓ ఒంటె గుడారం దగ్గరకు వచ్చి ‘సాయిబు.. సాయిబు.. బాగా చలేస్తోంది, కాస్త కాళ్లు నీ గుడారంలో పెట్టుకుంటాను’ అంది. పోన్లే అని సాయిబు సరే అన్నాడు. గంట తర్వాత ‘చలికి చెవులు వణుకుతున్నాయి, కాస్త బుర్ర కూడా పెట్టుకోనా’ అంది. పోన్లే అని మళ్లీ సరే అన్నాడు. ఇంకాసేపటికి చూస్తే ఒంటె గుడారంలో హాయిగా ఉంది. సాయిబు అర్ధరాత్రి చలిలో రోడ్డు మీద నిలబడ్డాడు.
జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి. వైఎస్సార్‌సీపీ నుంచి మెల్లగా టీడీపీలో అడుగుపెట్టిన జెడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కేవలం రెండు నెలల్లోనే మొత్తం పార్టీని కబ్జా చేసేశారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పాతికేళ్లుగా పార్టీ జెండా మోసిన వారంతా నిరుత్తరులై చూస్తున్నారే తప్ప ఆయనను నిలువరించలేకపోతున్నారు.
కాళ్లతో మొదలై.. పీఠం దాకా
పార్టీలో చేరిన తొలి రోజు నుంచే చిన్న శ్రీను ప్రత్యేక పవర్ సాయింట్‌గా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారని క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. ముందు తన కూతురికి రాజకీయ అవకాశం కావాలని చిన్నకోరికగా జెడ్పీటీసీ సీటు అడిగి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్ పీఠాన్ని కుమార్తెకు కానుకగా ఇచ్చారు. ఒంటె కాళ్లు పెట్టి, బుర్రపెట్టి, చివరికి గుడారాన్నే ఆక్రమించినట్లు ఆయన అడుగులు సాగాయని సీనియర్లు లోలోన కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో కూటమి మిత్రదర్మాన్ని, కులవివాదం ఉన్నా పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హైకమాండ్‌ను ఆయన ఉపయోగించుకున్న తీరు పార్టీని నమ్ముకున్న వారిలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
చలితో పాత కాపులు
ఆయన జోరుతో టీడీపీ పాతకాపులు లోలోన కుతకుతలాడుతున్నా బయటకు ఏమీ అనలేక గుడ్లనీళ్లు మిండుతున్నారు. జనసేన, బీజీపీ, టీడీపీ నాయకులతోపాటు మంత్రి కొండపల్లి వర్గం కూడా ఈ పరిణామాలను జీర్ణించుకోలేక పోతోంది. గుడారం ఇచ్చిన సాయిబు చలిలో నిలబడినట్లు, పార్టీని కాపాడిన సీనియర్లు ఇప్పుడు బయట నిలబడే పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
జనసేనకు చెక్ వెనుక ఆయనేనా?
కూటమి భాగస్వామి జనసేన జిల్లాలో ఎదగకుండా ఆ పార్టీ నాయకులకు స్థానిక సంస్థల్లో పదవులు దక్కకుండా చేసిన ఎత్తుగడలో చిన్న శ్రీనుదే కీలక పాత్ర అన్ని అభిప్రాయం జనసేన శ్రేణుల్లో బలంగా ఉంది. క్షేత్రస్థాయి మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీల నుంచి మన్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవుల వరకు వాటి పంపకంలో కూటమి మిత్రధర్మాన్ని పాటించకపోవడంలో చాపకింద నీరులా వ్యవహరించారని ఆయనపై జనసేన కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు.
టీడీపీలో చిన్నశ్రీను కబ్జా పర్వం
వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన రెండు నెలల్లో కూటమిలో ‘చిన్న’
కుంపటి!
కూతురికి జెడ్పీ పీఠం కట్టబెట్టిన వైనం
జనసేనకు పదవులు దక్కకుండా ఎత్తుగడ
గుడ్ల నీళ్లు మింగుతున్న కూటమి
పాత కాపులు


