భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసకు చెందిన బొర్రా సతీష్, శృతి దంపతులకు ధన్యశ్రీ (9), దర్శి (6) ఇద్దరు కుమార్తెలు. రిలయన్స్ స్టోర్‌లో సతీష్ పనిచేస్తుండగా.. శృతి ఇంటి వద్ద అత్త సత్యవతితో కలిసి కిరాణా దుకాణం నిర్వహించేవారు. సతీష్ సోదరుడు సురేష్, మరదలు సునీతతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సతీష్.. భార్య శృతితో పాటు అదే స్టోర్‌లో పనిచేస్తున్న సూరిబాబు, మరో ఇద్దరితో కలిసి శ్రీముఖలింగం దర్శనానికి వెళ్లివస్తూ మృతిచెందారు. మంగళవారమే సతీష్, శృతి పెళ్లిరోజు. దైవదర్శనం చేసుకుని వస్తే అంతా శుభమే జరుగుతుందని భావించి వెళ్లిన ఆ భార్యాభర్తలు తిరిగిరాని లోకాలకు చేరుకోవడం కుటుంబ సభ్యులు, బంధువులను మరింత కలచివేసింది.
తల్లిదండ్రుల కోసం ఎదురుచూసిన ఆ చిన్నారులకు ఇకపై ఎవరు దిక్కు అనే ఆలోచనే అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, సంగివలస గ్రామస్తులు ఘటనాస్థలికి, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి చేరుకున్నారు. బుధవారం సంగివలసలో దంపతుల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


