● మహారాజ కళాశాల ఎదుట
ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
విజయనగరం గంటస్తంభం:
ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం ఆపాలని, ఎలాంటి షరతులు లేకుండా పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరంలోని మహారాజ అటానమస్ కళాశాల గేటు ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ, కళాశాలలో చేరే సమయంలో జీరో ఫీజు అని చెప్పి, ఇప్పుడు పరీక్షల సమయంలో ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని, లోపలికి అనుమతిస్తామని యాజమాన్యం ఒత్తిడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే బాధ్యత మాది ఎలా అవుతుందని ప్రశ్నించారు. యాజమాన్యం తీరుతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ స్పందించి.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ వి.భారతి, పట్టణ అధ్యక్షుడు సూరిబాబు, గుణ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


