చీపురుపల్లి రూరల్(గరివిడి): కార్తీక పౌర్ణమి పర్వదినాన పాఠశాలకు సెలవిచ్చారు. తోటి పిల్లలతో కలిసి అన్నాచెల్లెలు సరదాగా ఆడుకుంటూ స్నానం కోసం ఇంటికి సమీపంలోని గెడ్డకు వెళ్లారు. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందన్న సంగతి ఆ పసి పిల్లలకు తెలియలేదు. నీటి రూపంలో ఇద్దరు చిన్నారులను మృత్యువు మింగేసింది. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. పున్నమి వేళ ఆ కుటుంబంలో చీకటి నింపింది.
గరివిడి మండలం వెంకుపాత్రునిరేగ గ్రామానికి చెందిన ఎర్రబోలు రాజు, రమ దంపతులకు ధనుష్ (8), వర్ష(6) ఇద్దరు పిల్లలు. స్థానిక పాఠశాలలో ధనుష్ మూడో తరగతి, వర్ష ఒకటో తరగతి చదువుతోంది. రాజు లారీ డ్రైవర్గా పనిచేస్తూ భార్య, పిల్లలను సాకుతున్నాడు. మంగళవారం ఉదయం 9–10 గంటల మధ్య తోటి పిల్లలతో కలిసి సరదాగా స్నానం చేసేందుకు గెడ్డలోకి దిగిన చిన్నారుల్లో ధనుష్, వర్ష గొయ్యిలోకి జారిపోయారు. ఈత రాకపోవడంతో మునిగిపోయారు. అక్కడి పిల్లలు కేకలు వేస్తూ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారు పరుగున వెళ్లి ఇద్దరు చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే ధనుష్ చనిపోగా, కొన ఊపిరితో ఉన్న వర్షను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వర్ష కూడా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు పిల్లలు ఒకేరోజు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. కార్తీక పౌర్ణమివేళ తమ ఆశాదీపాలు ఆరిపోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారులు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో వి.వి.రేగ గ్రామంలో విషాదం అలముకుంది.
● అన్నాచెల్లెలు మృతితో వి.పి.రేగలో విషాదం
● శోకసంద్రంలో తల్లిదండ్రులు


