విజయనగరం రూరల్: జిల్లాలోని 27 మండలాల్లో గురువారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ భోగాపురం మినహా మిగతాచోట్ల సజావుగా సాగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కొత్తగా ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులతో ముందుగా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు, మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పూర్తి చేశారు.
● గుర్ల మండలంలో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీలకు 9 చొప్పున ఎంపీటీసీ స్థానాలు గెలుపొందగా లాటరీ విధానంలో అక్కడ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. భోగాపురంలో కోరంలేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే, చీపురుపల్లి, పూసపాటిరేగ మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా వేయగా, మిగతాచోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా నిర్వహించారు.
జనసేన, బీజేపీలకు దక్కని ఎంపీపీ పదవి
కూటమి పార్టీల్లో జనసేన, బీజేపీలకు ఎంపీపీ పదవుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ధర్మాన్ని విస్మరించి ఒక్క ఎంపీపీ సీటు కూడా ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించింది. గురువారం నిర్వహించిన 26 ఎంపీపీ ఎన్నికల్లో ఒకటి వైఎస్సార్సీపీ దక్కించుకోగా మిగతా 25 చోట్ల కూటమి పార్టీలకు దక్కినా 25 ఎంపీపీలను తెలుగుదేశం పార్టీ తీసుకోవడంతో జనసేన, బీజేపీలకు చుక్కెదురైంది. కేవలం మూడుచోట్ల జనసేనకు, ఒకచోట బీజేపీకి వైస్ ఎంపీపీలను నామమాత్రంగానే కేటాయించారు. మీకు ఇవే ఎక్కువ అన్నట్లు తెలుగుదేశం తీరు కొనసాగిందని చెప్పొచ్చు.
● జిల్లాలో గురువారం నిర్వహించిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు తేజ్‌భరత్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత గజపతినగరంలో ఎన్నిక ప్రక్రియను పరిశీలించిన ఆయన కాలంరాజుపేటలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే, గుర్ల, నెల్లిమర్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
26 మండలాల్లో ఎంపీపీ,
వైస్ ఎంపీపీల ఎన్నిక
భోగాపురంలో వాయిదాపడిన ఎంపీపీ ఎన్నిక
ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు తేజ్‌భరత్
గరివిడి ఎంపీపీగా మీసాల, వైస్ ఎంపీపీగా రెడ్డి
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండల పరిషత్‌లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికతో పాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 20 ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన మీసాల విశ్వేశ్వరరావును ఎంపీపీగా, రెడ్డి భారతిని వైస్ ఎంపీపీగా సభ్యులు ఎన్నుకున్నారు. దీంతో గరివిడి మండల పరిషత్‌కు నూతన నాయకత్వం ఏర్పడింది. ఎన్నికల అధికారి లావణ్య, ఎంపీడీఓ ఎం.వి.బి.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ సీహెచ్.బంగార్రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ నూతన ఎన్నిక ప్రక్రియతో పాటుగా ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం సజావుగా పూర్తయ్యింది.


