రాష్ట్రంలో అరాచక పాలన.. | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన..

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

● వైఎస్సార్‌సీపీ నాయకులు

రాజాం: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని.. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అధికార బలంతో దౌర్జన్యంగా లాక్కుంటోందని వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తలే రాజేష్‌ ఆరోపించారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులను అడ్డుకున్నారన్నారు. నామినేషన్లు వేసిన వారిని సైతం కూటమి నాయకులు బెదిరించారని మండిపడ్డారు. ఈ సంస్కృతి రాజాం ప్రాంతానికి పాకడం బాధాకరమన్నారు. రాజాం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పాలవలస పద్మావతి పోటీ చేస్తున్నారని, అలాగే 32 మంది కౌన్సిలర్లు కూడా ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. కూటమి నాయకులు ఎటువంటి దౌర్జన్యాలకు పాల్పడినా తగ్గే పరిస్థితి లేదన్నారు. పట్టణ ఓటర్లు కూటమి అరాచకాలను గుర్తించి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 2029లో జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాంలో అభివృద్ధిని పరుగులెట్టిస్తామన్నారు. కూటమి నాయకులు ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం..

రాజాం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక ప్రదేశంలో పెద్ద భవంతిని నిర్మిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లా న చంద్రశేఖర్‌ అన్నారు. తాగునీటి సమస్య, విద్యు త్‌ కోత, తదితర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ మాట్లా డుతూ.. కూటమి హయాంలో రాజాం నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి ప్రతి నెలా ఎమ్మెల్యే ఇంటికి ముడుపులు చేరుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేతో పాటు అతని సోదరుడు రాజాంలో దందాలు చేపడుతున్నారని ఆరోపించారు.

విజయావకాశాలు పుష్కలం..

రాజాంలో మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే విజయావకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు బొత్స అప్పలనరసయ్య జోష్యం చెప్పారు. పాలవలస శ్రీను, పద్మావతిలను గెలిపిస్తే న్యాయబద్ధమైన పాలన అందిస్తారని చెప్పారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వారు ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, పార్టీ రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement