అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

రాజాం సిటీ: పట్టణంలోని మాదిగవీధికి చెందిన పోల్సపల్ల్లి బాబ్జీ(39) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం రోడ్డులో టామ్‌ అండ్‌ జెన్నీ దాబాకు ఎదురుగా ఉన్న టిఫిన్‌షాపు వద్ద ఆయన మృతిచెందిన విషయాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పోల్పపల్ల్లి బాబ్జీకి 18 ఏళ్ల క్రితం రాజాం పట్టణానికి చెందిన విజయరాణితో వివాహం జరిగింది. గడిచిన ఆరేళ్లుగా బాబ్జీ శ్రీకాకుళం రోడ్డులో గల మజ్జిగౌరి దాబాలో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మద్యం తాగడానికి అలవాటు పడడంతో పాటు అతిగా మద్యం తాగడం కారణంగా ఇటీవల కామెర్ల వ్యాధి సోకిందని మృతుడి భార్య పోలీసులకు తెలిపింది. రాగోలులోని జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స సమయంలో మద్యం తాగవద్దని వైద్యులు తెలిపినట్లు వివరించింది. అయితే వైద్యుల మాటలను పట్టించుకోకుండా మద్యం తాగేవాడని, ప్రతిరోజూ మాదిరిగానే ఈనెల శనివారం యథావిధిగా పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగిరాలేదని ఫిర్యాదులో పేర్కొంది. భర్త తన అత్తవారింటికి వెళ్లి ఉంటాడని భావించానని, ఆదివారం ఉదయం 7.20 గంటల సమయంలో అతను పనిచేసే దాబా యజమాని ఫోన్‌ చేసి బాబ్జీ శ్రీకాకుళం రోడ్డులో ఓ దాబా ఎదురుగా ఉన్న టిఫిన్‌ షాపు వద్ద రక్తపు మడుగులో పడి మరణించి ఉన్నట్లు సమాచారం ఇచ్చారని వివరించింది. బాబ్జీ నోటి నుంచి రక్తం కారుతోందని తెలియజేయగా వెంటనే తన సోదరుడు పవన్‌కుమార్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా భర్త విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉన్నాడని వాపోయింది. తన భర్త మృతిపై విచారణ చేసి, తగు న్యాయం చేయాలని స్టేషన్‌లో మృతుడి భార్య ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తు ముమ్మరం

ఆమె ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించడంతో పాటు బాబ్జీ మృతిపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని ఎస్సై మహమ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ తెలిపారు. క్లూస్‌టీం వచ్చి సంఘటనా స్థలం వద్ద వేలిముద్రలు సేకరించింది. రాజాం పట్టణ సీఐ నవీన్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలు పరిశీలించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement