మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘనస్వాగతం | - | Sakshi
Sakshi News home page

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఘనస్వాగతం

Nov 14 2026 12:35 AM | Updated on Nov 14 2026 12:35 AM

పూసపాటిరేగ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విచ్చేసిన భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మొక్కను అందజేశారు.

ఆయిల్‌పామ్‌ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ

● కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కె.శ్రీనివాస్‌

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆయిల్‌ పామ్‌ స్టాక్‌ హోల్డర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. జోనల్‌ విధానాన్ని తొలిగించి ఓపెన్‌ మార్కెట్‌ విధానం అమలు చేస్తే మిల్లులు మధ్య పోటీ పెరిగి , రైతులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్‌ సాగును కేవలం ఏక పంట విధానంలో కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మిశ్రమ పంటల సాగు విధా నంలో చేపట్టాలన్నారు. మలేషియా వంటి దేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక సాగు పద్ధతులను పరిశీలించి, వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాస్‌, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు

విజయనగరం రూరల్‌: ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌లు ఎన్నికైన గ్రామాలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. గతంలో జనాభా ప్రాతిపదికన రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహక నగదు అందించేవారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం 5 వేలలోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ. 15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహక నగదు అందించనున్నారు. గతంలో 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షలు, 2,001 నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు అందించేవారు. ఈ నిధులను సంబంధిత గ్రామ పంచాయతీల్లో ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసంక్షేమ పనులకు వినియోగించాల్సి ఉంటుంది. నిర్ణీత ఆర్థిక, అకౌంటింగ్‌, ఆడిట్‌ నిబంధనలను పాటించాలి.

గూగుల్‌ క్యాంపస్‌ అంబాసిడర్లుగా సీతం విద్యార్థినులు

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని సీతం కళాశాలకు చెందిన బీటెక్‌ సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతున్న హేమశ్రీ, మౌనిక, భువన, ఉష ప్రతిష్టాత్మక గూగుల్‌ క్యాంపస్‌ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. వీరిలో సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల పట్ల అభిరుచిని గుర్తించి వీరికి ఈ అవకాశం కల్పించారు. వీరు గూగుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సాంకేతిక కార్యక్రమాల్లో భాగస్వామాలు కానున్నారు. అరుదైన అవకాశం అందిపుచ్చుకున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.వి.రామమూర్తి, కళాశాల డైరెక్టర్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, సీఎస్‌ఈ విభాగాధిపతి డాక్టర్‌ వేణుమాధవ్‌, ప్లేస్‌మెంట్‌ విభాగం ప్రతినిధు లు డాక్టర్‌ సాయిరాం పట్నాయక్‌, అవినాష్‌, సందీప్‌ శుక్రవారం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement