పార్వతీపురం రూరల్: మండలంలోని లక్ష్మీనారాయణపురం మలుపు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల రవాణాకు వినియోగించే ఈ ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్తుండగా మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆటోలో నలుగురు పెద్దవారితో పాటు, ఇద్దరు పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఆ విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు, కేవలం స్వల్ప గాయాలతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ఆటో నడుపుతున్న డ్రైవర్‌కు సైతం ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.


