విజయనగరం రూరల్:
జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు పల్లెల్లో ప్రజాప్రతినిధుల ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించి మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న తొలివిడత, 16న రెండో విడత, 19న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్లు విడదల చేయనున్నారు. దీంతో జిల్లాలో గ్రామీణ రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. విజయనగరం జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 773 గ్రామ పంచాయతీలు, 7,292 వార్డులు, 7,368 పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,78,757 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్న గరివిడి, డెంకాడ మండలాల్లోని నాలుగు గ్రామ పంచాయతీలను మినహాయించి మిగిలిన 773 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, వాహనాలు సిద్ధం
నామినేషన్ల కేంద్రాలు: మూడు విడతల్లో కలిపి 222 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందితో సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన 8,866 బ్యాలెట్ బాక్సులతో పాటు 20 శాతం అదనపు నిల్వను అందుబాటులో ఉంచారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు 121 వాహనాలను, ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 53 ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను సిద్ధం చేశారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారుల నియామకంతో పాటు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు, వ్యయ పరిశీలన, రోజువారీ నివేదికల సమర్పణపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఎన్నికలు
జరగనున్న పంచాయతీలు
పంచాయతీలు: 773
వార్డులు: 7,292
పోలింగ్ స్టేషన్లు: 7,368
ఓటర్ల వివరాలు
ఎస్టీ: 30,550
ఎస్సీ: 1,33,031
బీసీ: 10,37,030
ఇతరులు: 83,372
పురుషులు:6,32,537
మహిళలు:6,46,183
ఇతరులు: 37
మొత్తం: 12,78,757
సర్పంచుల రిజర్వేషన్లు ఇలా...
ఎస్సీ: 83 ఎస్టీ: 18
బీసీ: 279 జనరల్: 395
మహిళలు: 379
పురుషులు: 396
మొదటి విడత (నవంబర్ 26): 9 మండలాల్లోని 235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు. నేడు (13న) నోటిఫికేషన్ విడుదల కానుండగా, 15న ఆర్వో నోటీసు జారీ, 17 వరకు నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ ఉంటాయి. 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు.
రెండో విడత (నవంబర్ 29): 9 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలై, 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతాయి. 29న పోలింగ్, కౌంటింగ్ నిర్వహిస్తారు.
మూడో విడత (డిసెంబర్ 2): 9 మండలాల్లోని 283 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 19న నోటిఫికేషన్, 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణ ఉంటాయి. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
తొలి విడతకు నేడు నోటిఫికేషన్
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ
ఎన్నికల నిర్వహణ
నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్.. అదే రోజు ఫలితాలు
గజిబిజిగా షెడ్యూల్:
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సమాయత్తమవ్వగా దానికి సంబంధించి కొన్ని మండలాల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు మార్పు చేశారు. అయితే షెడ్యూల్ మార్చినా మండలాలల్లోని పంచాయతీల సమాచారాన్ని మీడియాకు అధికారికంగా గురువారం రాత్రి వరకు విడుదల చేయకపోవడం విశేషం.
సున్నిత, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లాలో గుర్తించిన 181 సున్నిత, 111 అతి సున్నిత, 36 సమస్యాత్మక గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు.


