● మాస్టర్ ప్లాన్‌లో టీడీపీ
● రాజాం టికెట్ కోసం కండువా మార్చే ప్రయత్నాలు
● విజయవాడలో తిష్టవేసిన టీడీపీ బడాబాబులు
● కులప్రాతిపదికన జీఎంఆర్‌తో రికమండేషన్‌లో మరో వర్గం
రాజాం: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజాం పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనూహ్యంగా ఇక్కడి సీటును జనసేనకు కూటమి కేటాయించింది. ఈ సీట్లు పంపకాల్లో ఇక్కడ సీటు జనసేనకు రావడంతో కూటమిలోని టీడీపీ నేతలకు మింగుడుపడడంలేదు. ఎలాగైనా ఇక్కడ సీటు సంపాదించి పోటీలోకి దిగాలని టీడీపీ యోచిస్తోంది. స్ధానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌కు అనుచరులుగా ఉన్న కొంతమంది బడాబాబులు ఈ సీటుకోసం విజయవాడ వేదికగా పావులుకదుపుతున్నారు.
జనసేన ఇన్‌చార్జికి పంగనామాలు తప్పవా..?
రాజాం జనసేన పార్టీ ఇన్‌చార్జిగా పొగిరి సురేష్‌కుమార్ కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయు నిగా పనిచేసే ఈయన స్వచ్ఛంద ఉద్యోగవిరమణ చేసి పార్టీకోసం సేవలందిస్తున్నారు. ఏడాది కిందట ఈయన భార్య కృష్ణవేణికు రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పేరు ప్రకటించారు. ఇంతలోనే రాజాంలోని టీడీపీ వర్గీయులు ఇక్కడ జనసేన పార్టీలేదు... ఏఎమ్‌సీ ఎలా ఇస్తారంటూ రాద్ధాంతం చేశారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్‌లు పెట్టి ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పట్లో ఈ ఏఎమ్‌సీని వెనుకకు తీసుకుని, టీడీపీ నేత గురవాన నారాయణరావు భార్య పార్వతికి అప్పగించారు. అప్పట్లో వచ్చినట్టే వచ్చి ఏఎంసీ పోవడంపై సురేష్‌కుమార్ అప్రతిష్టతకు గురయ్యారు. ఇప్పుడు ఊహించకుండానే జనసేనకు మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించడంతో గత నెలరోజులుగా ఆయన అన్నివర్గాల ప్రజలను, ఓటర్లను, కులసంఘాల పెద్దలను కలిసి తన కార్యక్రమాలు ముమ్మరంచేశారు. ఇంతలో టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను తీసు కుని విజయవాడలో తిష్టవేశారు. గత వారం రోజులుగా అక్కడ జనసేన పార్టీ పెద్దలతో పైరవీలు చేస్తున్నారు. పదవి కోసం పార్టీ కండువాలు మార్చేసి, జనసేనలోకి వెళ్లి రాజాంలో పోటీచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులు ఖాతాలో రాజాం పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు ప్రభుత్వ వైద్యుడు, టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో వైద్యుడు నేరుగా జనసేనకు చెందిన పెద్ద నేతలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా, కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన పెద్దపెద్ద నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరికి మాత్రం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు అభయమివ్వగా, మిగిలినవారంతా తమకు తెలిసిన వేరే నేతలతో మంతనాలు చేస్తున్నట్లు భోగట్టా. వీరి వ్యూహాలు ఫలించి జనసేన తరఫున టికెట్ వీరిలో ఎవరికో ఒకరికి వస్తే పార్టీని నమ్ముకున్న సురేష్‌బాబుకు శఠగోపం పెట్టినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత వారంరోజులు టీడీపీ బడాబాబులు చేస్తున్న ప్రయత్నాలు జనసేన పార్టీ నేతలకు కునుకులేకుండా చేస్తున్నాయి.
తెరమీదకు మరో కొత్త వ్యక్తి..
ఇదిలా ఉండగా జనసేన పార్టీ తరఫున మరో కొత్త వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. జీఎంఆర్ సంస్థల్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రాజాం పట్టణంలో చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తికి చైర్మన్ బొట్టు పెట్టాలని కూటమిని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. జీఎంఆర్ సంస్థలు ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని, రాజాంకు చెందిన బనిశెట్టి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఈ పదవిలో పోటీచేసేందుకు జనసేన తరఫున అవకాశం కల్పించాలని గట్టిగానే పట్టుబట్టినట్లు తెలిసింది. ఏదేమైనా జనసేన పార్టీని నమ్ముకున్న సురేష్‌కుమార్‌కు ఈ సంకేతాలు తలనొప్పిగా మారాయి. కూటమి తరఫున చైర్మన్ బరిలో నిలిచేదెవరనేది శుక్రవారం వెలువడే అవకాశం కనిపిస్తోంది.


