పూసపాటిరేగ: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌కు విచ్చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్నలకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఈ మేరకు భోగాపురంలోని అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి, ఐజీపీ గోపీనాథ్ జెట్టీ, ఎస్పీ ఎఆర్ దామోదర్‌లు గురువారం వారిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతించారు.
సంక్షేమ వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు
● మౌలిక సదుపాయాలు, భోజన
నాణ్యతపై సీనియర్ సివిల్ జడ్జి ఆరా
విజయనగరం లీగల్: విజయనగరం పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రీ–మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం, పోస్టుమెట్రిక్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతిగృహం–2, పోస్టు మెట్రిక్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లను ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, వంటగది, భోజన వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, ఆరోగ్యకరమైన వాతావరణం, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం సంబంధిత అధికారుల బాధ్యత అని జడ్జి పేర్కొన్నారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మన్యం సవారీ ఎకో బైక్‌ర్యాలీ
సీతంపేట: మన్యం సవారీ ఎకోబైక్ ర్యాలీని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో గురువారం సీతంపేటలో నిర్వహించారు. వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది యువత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక అడ్వెంచర్ పార్కు నుంచి బెనరాయి జలపాతం వరకు బైక్‌పై సుమారు 12 కిలోమీటర్ల టూర్ నిర్వహించారు. బెనరాయి ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉందని, రాత్రి సమయంలో క్యాంపింగ్ టెంట్‌లలో కూడా స్టే చేయవచ్చని కలెక్టర్ అన్నారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అంతకుముందు స్థానిక గ్రామస్తులతో మాట్లాడి వారితో సహపంక్తి భోజనం చేసి ఫొటోలు దిగారు. త్వరలో ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.


