జనవరి 25 నుంచి రెండో దశ జనగణన | - | Sakshi
Sakshi News home page

జనవరి 25 నుంచి రెండో దశ జనగణన

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

● 40 రోజుల్లో 800 మంది వివరాల సేకరణ

● ప్రతి ఒక్కరి సమాచారం కచ్చితంగా నమోదు చేయాలి

విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనగణన–2027 ప్రక్రియ రెండో దశను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని కలెక్టర్‌, ప్రన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి సూచించారు. జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న రెండో దశ జనగణనలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కచ్చితమైన వివరాలను సేకరించాలని ఆదేశించారు.ఈ మేరకు చింతలవలసలోని ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా, చార్జ్‌ స్థాయి అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల జనగణన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం రెండో రోజు కలెక్టర్‌ పాల్గొని పరిశీలించారు. అధికారుల అవగాహన స్థాయిని పరీక్షించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కో ఎన్యూమరేటర్‌కు కేటాయించిన 40 రోజుల గడువులో సుమారు 800 మంది వివరాలను సేకరించాల్సి ఉంటుందని, ఈ లెక్కన రోజుకు దాదాపు ఏడు ఇళ్లకు వెళ్లి సమాచారం నమోదు చేయాల్సింటుందని తెలిపారు. ప్రారంభంలో కొంత సమయం పట్టినా, అనుభవం పెరిగే కొద్దీ పనిలో వేగం పెరుగుతుందన్నారు. జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలపై ఎన్యూమరేటర్లు ముందుగానే పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నించి కచ్చితమైన వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పొరపాట్లు దొర్లకూడదు

సమాచార సేకరణలో ఎలాంటి పొరపాట్లు, సమన్వయ లోపాలు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు రోజుల శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణపై పూర్తి స్పష్టత పొందాలని సూచించారు. జనగణనలో సేకరించే కుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుల ద్రువీకరణ పత్రాల జారీకి ప్రామాణికంగా పరిగణించబోమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌.సత్తిబాబు, జనగణన జాయింట్‌ డైరెక్టర్‌, సీపీఓ బాలాజీ, డీపీఓ డీవీ మల్లికార్జునరావు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏఎస్‌ఓలు, డీటీలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement