● చివరి మంగళవారంతో పెరిగిన భక్తుల రద్దీ
● కనీస సౌకర్యాలు కల్పించని
దేవస్థానం
విజయనగరం కల్చరల్ (క్రైమ్): ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు మంగళశారం పొటెత్తారు. పైడితల్లి అమ్మవారి జాతరలో చివరి మంగళవారం, ఆ పై రాత్రి ఉయ్యాల కంబాల ఉత్సవం కావడంతో తల్లి దర్శనం చేసుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వెల్లువెత్తారు. గత మంగళవారం సిరిమాను ఉత్సవం రోజు తుపాను, ఆపై ఎన్నికలు జరగడంతో భక్తులు పెద్దగా తల్లి దర్శనం చేసుకోలేదు. పైడితల్లి జాతరలో చివరి మంగళవారం కావడంతో నగరం నుంచే కాక జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళా భక్తులు వచ్చి తల్లి దర్శనం చేసుకున్నారు. ఉచిత బస్సు పథకం పుణ్యమా పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు మహిళా భక్తులు పొటెత్తారు. మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడిలో పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఉదయం 5గంటల నుంచి అధిక సంఖ్యలో మహిళలు వచ్చి తల్లి దర్శనం చేసుకున్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు వాపోయారు.పైగా జాతర రెండు రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసినప్పటికీ ఉయ్యాల కంబాల రోజున దర్శనం టికెట్ భక్తునికి ఒక్కొక్కరికి రూ. 50 ధర పెట్టడంతో దూరాభారం నుంచి ఉచితంగా బస్‌లో తల్లి దర్శనానికి వచ్చిన..ఆలయం వద్ద రూ.50 టిక్కెట్ కొనుగోలు చేసుకుని గర్భాలయంలోకి వెళ్లడంతో భక్తులు ఈసురో మంటున్నారు. పైగా అంతరాలయం దర్శనం లేకపోగా తల్లిని యాభై అడుగుల దూరం నుంచి దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో భక్తులు దేవస్థానం అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలో మంచినీరు సదుపాయం
.భక్తుల సౌకర్యాకర్యార్థం చదురుగుడిలో పడమర వైపున మంచి నీరు సదుపాయం కల్పించామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే చల్లని తాగు నీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. పైడితల్లి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం లోపలే ఆ మంచి నీరు సదుపాయం భక్తుల కోసం పెట్టామన్నారు. దర్శనం అనంతరం దక్షిణం వైపు వెనక భాగం నుంచి బయటకు వస్తే కనీస సౌకర్యాలు కూడా కల్పించామని ఆలయం అధికారులు పేర్కొన్నారు.
కనీస సౌకర్యాలు కరువు
తల్లి దర్శనం జరగడం పూర్వ జన్మ సుకృతం, పైడితల్లి దర్శనానికి దూరా భారం నుంచి వస్తున్నాం. గత మంగళవారం తుఫాన్, ఎన్నికలు రావడంతో తల్లి దర్శనం చేసుకోలేదు.ఈ వారం ఉయ్యాల, కంబాల ఉత్సవం ఆపై జాతర చివరి మంగళవారం అని వస్తే టికెట్ ధర రూ.50 పెట్టి దర్శనం చేసుకున్నాం. కనీసం మంచి నీటి సదుపాయం కల్పించక పోవడం బాధాకరం.
– ఆది నారాయణ, పాన్ షాప్ యజమాని


