● అనుమతులు లేకుండా జేసీబీతో భవనంలో సగభాగం కూల్చివేత
● ఆక్రమణ దారులను అడ్డుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు
పూసపాటిరేగ: స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో కూల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించడంతో రెవెన్యూ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. మండలకేంద్రం పూసపాటిరేగలో ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కొంత మంది వ్యక్తులు జేసీబీ సాయంతో కూల్చివేస్తున్న విషయం తెలుసుకున్న పూసపాటిరేగ వీఆర్‌ఓ డి.రామకృష్ణ అక్కడికి చేరుకుని కూల్చివేత పనులు నిలిపివేశారు. ప్రభుత్వానికి చెందిన భవనాన్ని ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా కూల్చివేస్తుండగా ఆక్రమణదారులను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయడం చట్ట విరుద్దమని స్పష్టం చేశారు. అనంతరం పూసపాటిరేగ గ్రామ రెవెన్యూ అధికారి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కూల్చివేయడానికి ప్రయత్నించింది ఎవరు? దర్జాగా పట్టపగలు ప్రభుత్వ భవనాన్ని జేసీబీతో కూల్చివేసింది ఎవరనే చర్చ జరుగుతోంది. ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


