ఎమ్మెల్యే దౌర్జన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దౌర్జన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

● ఎమ్మెల్సీ విక్రాంత్‌ నేతత్వంలో

కలెక్టర్‌కు బాధితుల ఫిర్యాదు

పార్వతీపురం రూరల్‌: వీరఘట్టం మండలం కత్తుల కవిటి పోలింగ్‌ కేంద్రంలో అధికార పక్ష ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ నేతృత్వంలో బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో బాధిత పోలింగ్‌ ఏజెంట్లు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలింగ్‌ రోజున జరిగిన అవాంఛనీయ ఘటనను బాధితులు ఎమ్మెల్సీతో కలిసి కలెక్టర్‌కు కూలంకుషంగా వివరించారు. కత్తుల కవిటి జెడ్పీహెచ్‌ఎస్‌లోని 39వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దౌర్జన్యంగా ప్రవేశించారని వారు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా సీసీ కెమెరాలు నిలిపివేసి, పోలింగ్‌ ఏజెంట్లు పక్కి కిరణ్‌ కుమార్‌, గొల్ల రమేష్‌, గేదెల సుదర్శన్‌ రావులపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణహాని బెదిరింపులకు గురిచేశారని వివరించారు. ఎమ్మెల్యే అనుచరుల తీరుతో క్యూలో ఉన్న ఓటర్లు సైతం భయాందోళనలకు గురైన పరిస్థితిని ఏకరువు పెట్టారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి..

ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపి, అక్రమ ప్రవేశం, దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై భారత న్యాయ సంహిత, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ విక్రాంత్‌, బాధితులు కలెక్టర్‌ను కోరారు. తక్షణమే ఆ బూత్‌లోని రికార్డులు, సీసీ కెమెరాల డేటా స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పాలకొండ మండలం బెజ్జి గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 8 వార్డులకు ఒకేసారి ఎలక్షన్లు జరిగేలా చూడాలని కోరుతూ మాజీ సర్పంచ్‌ సివ్వాల శ్రీనివాసరావు రాసిన అర్జీని కలెక్టర్‌కు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ విక్రాంత్‌ అధికారులను కోరారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడి పరిస్థితిని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement