● ఎస్పీ ఏఆర్ దామోదర్
● హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్ అందజేత
విజయనగరం టౌన్: ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన హోంగార్డ్స్ పిల్లలను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి, వారిని ప్రత్యేకంగా అభినందించి, రూ. 2 వేలు చొప్పున మెరిట్ స్కాలర్ షిప్‌లను ఎస్పీ దామోదర్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించి, మంచి ఫలితాలను సాధించాలని సూచించారు. చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని, ఉపాధ్యాయుల సహకారంతో ఎప్పటికప్పుడు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా హోంగార్డ్స్ తక్కువ జీతంతో ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు కష్టపడే తత్వాన్ని, సేవలను వారి పిల్లలుగా విలువనివ్వాలని, వారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎన్నడూ ప్రవర్తించవద్దని హితవు పలికారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆకతాయిలు చెప్పే మాటలు వినవద్దని, వా రి ప్రలోభాలకు లొంగవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత లక్ష్యంతో చదువును అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఎస్పీ దామోదర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రమేష్‌కుమార్, టి.శ్రీనివాసరావు, పోలీసు కార్యాలయం బి–సెక్షన్ పర్యవేక్షకురాలు లలితకుమారి, హోంగార్డులు, వారి కుటుంబసభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


