● డీఈఓకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వినతి
విజయనగరం అర్బన్: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పాఠశాల స్థాయి పరిశీలకుల (ఎస్‌ఎల్‌ఓ) నియామకంపై విద్యాశాఖ జారీ చేసిన అదనపు మార్గదర్శకాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ డీఈఓ యూ.మాణిక్యంనాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం పదోతరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మిషన్ మార్చ్’లో భాగంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతిరోజూ అదనపు తరగతులు నిర్వహించడంతోపాటు సబ్జెక్టుల వారీగా స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ఎస్‌ఏ–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంపై అదనపు తనిఖీల పేరుతో ఇతర మండలాల నుంచి స్కూల్ లెవెల్ అబ్జర్వర్లను నియమించడం ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోనే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమీక్షకు సంబంధించిన వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉందని గుర్తుచేశారు. దీనికి అదనంగా ఇతర మండలాల ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించడం వల్ల నిర్వహణలో సంక్లిష్టత పెరుగుతుందని తెలిపారు. ఒకే స్థాయి అర్హత కలిగిన ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను తిరిగి తనిఖీ చేయించడం వల్ల ఆశించిన ప్రయోజనం కంటే అనవసరమైన అంతరాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పాఠశాలల నిర్వహణ, విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమీక్ష వంటి అంశాలపై ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలోనే జరగాలని కోరారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న అదనపు పరిశీలకుల నియామక మార్గదర్శకాలను వెంటనే ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొవ్వాడ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఇజ్జిరోతు రామునాయుడు, జిల్లా కోశాధికారి ఏజీ తాతారావు, జిల్లా ఉపాధ్యక్షుడు కేళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


