రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులోని పి.కుమార్‌కు చెందిన ఆటో మొబైల్ షాఫులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అంతా దీపావళి సందడిలో ఉండగా దుకాణం వద్ద దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సుమారు రెండు గంటలకాలం పాటు మంటలు దుకాణంలో చెలరేగడంతోపాటు పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మందలు అదుపుచేశారు. షాపులోని లూబ్రికేటింగ్ ఆయిల్స్, ట్రాక్టర్ విడిభాగాలు, గ్రీజు, బెల్టులు తదితర వస్తుసామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25లక్షలు వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేశామని ఫైర్ ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదం బాణసంచా కారణంగా జరిగి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు.


