● సంగాంలో బలరాముడు ప్రతిష్టించిన శివలింగం ● అలహాబాద్ తరహాలో ఇక్కడ త్రివేణి సంగమం ప్రత్యేకత
వంగర: వంగర మండలం సంగాంలో పవిత్ర సంగమేశ్వరస్వామి దర్శనం సర్వపాప హరణం. కార్తీక మాస వేళల్లో సంగమేశ్వరుడిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే.. ఉత్తరాంధ్ర భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ద్వాపరయుగంలో బలరాముడు ఏకకాలంలో ప్రతిష్టించిన ఐదు శివలింగాల్లో ఇదొకటి.
త్రివేణి సంగమం స్నానం పుణ్యదాయకం
ఈ ఆలయ సమీపంలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు కలుస్తాయి. ఈ ప్రాంతం త్రివేణి సంగమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ తరహాలో ఈ ప్రదేశంలో మూడు నదులు కలిసే కూడలి ఉంది.
పితృదేవతలను స్మరించే స్థలం
మూడు నదులు కలిసే త్రివేణి ఒడ్డున పితృదేవతలకు కూడా ప్రత్యేక పూజలు అర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 400 సంవత్సరాల నాటి భారీ మర్రివృక్షం ఉంది. ఈ చెట్టు నీడన వంటావార్పు చేసి త్రివేణి సంగమంలో పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అలాచేస్తే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.
సంగాం ఇలా చేరుకోవాలి.....
సంగాం గ్రామం రాజాం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరం. వంగర, రుషింగి, కొప్పర గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కితే మెట్ట మగ్గూరు వద్ద దిగి అక్కడ నుంచి ఆటోలో సంగాం చేరుకోవచ్చు. ఉదయం 7.15, 8.00, 9.00, 11.00 గంటలకు, మధ్యాహ్నం 3.00, 4.30, 6 గంటలకు రాజాం కాంప్లెక్స్ నుంచి బస్సులు ఉన్నాయి. రాజాం నుంచి సంగాం వరకు ఆటోలు కూడా విరివిగా ఉంటాయి. పాలకొండ, వీరఘట్టం మీదుగా సంగాంకు చేరుకోవచ్చు.


