విజయనగరం కల్చరల్(క్రైమ్): విజయనగరం ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 742వ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ డాక్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు జయంతి కొత్తపేట ఆర్యసోమయాజుల కాశీపతీరావు స్మారక భవనంలో శనివారం ఘనంగా జరిగింది. ముందుగా సంస్థ సలహాదారులు డాక్టర్ అయ్యగారి రాఘవరావు, ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు మహదాసు నీలాద్రిరావు, సంస్థ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వర రావు, కార్యదర్శి డాక్టర్ మండపాక రవి, కాళ్ళ నిర్మల భాగవతారిణి, శైలజ, వంశీకృష్ణ తదితరులు నాయుడు చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం వర్ధమాన కళాకారిణి భాగవతుల అన్నపూర్ణ శివాత్మిక వయొలిన్ కచేరి అందరినీ అలరించింది. మృదంగంపై గణేష్ వనపర్తి సహకారం అందించారు. కచేరీని ముందుగా సారంగా వర్ణంతో ప్రారంభించి, దీక్షితార్ కృతి మహాగణపతి, ప్రధాన అంశంగా కళ్యాణి రాగంలో హేమాద్రి సుతే వయొలిన్‌పై పలికించారు. గణేష్ మృదంగంపై చక్కని అనుసరణ, తన్యావర్తనం వాయించి అందరి మన్ననలు పొందారు. సంస్థ సభ్యులు మోడెకుర్తి శ్రీనివాసరావు, విద్వాంసులు ఏడుకొండలు, కామేశ్వరరావు, కళాకారులను సత్కరించారు.


