నేడే పురపోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పురపోరు

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

విజయనగరం అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధంచేసింది. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపు, భద్రత, రవాణా, వెబ్‌కాస్టింగ్‌ వంటి కీలక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో మొత్తం 322 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు 82 వాహనాలను సిద్ధం చేసింది. స్థానిక రాజీవ్‌ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తేజ్‌ భరత్‌, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ శనివారం పరిశీలించారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ కౌంటర్లు, సిబ్బందికి కల్పించిన వసతులు, వాహనాల కేటాయింపు, రవాణా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూముల భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపైనా అధికారులతో సమీక్షించారు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, ప్రతి పోలింగ్‌ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్‌, ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేశారు. ఓట్లను ఈ నెల 3న లెక్కించనున్నారు. దీనికోసం విజయనరం రాజీవ్‌ స్టేడియంతోపాటు నెల్లిమర్లలోని స్థానిక కళాశాల, బొబ్బిలిలో ప్రత్యేకంగా కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. ఓటర్లంతా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

చిన్నారులతో ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగినులు

మూడు పట్టణాల్లో 322 పోలింగ్‌

కేంద్రాలు ఏర్పాటు

82 వాహనాలతో సిబ్బంది, సామగ్రి తరలింపు

పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిఘా.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement