● శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
తెర్లాం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఓటర్లను కోరారు. తెర్లాం మండలం లోచర్లలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల కిందట ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రజలను మోసంచేసి నిలువునా ముంచేసిందన్నారు. ఓటర్లంతా విజ్ఞతతో ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీ తరుఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీకి తెర్లాం మండలం కంచుకోట అన్నది నిరూపించాలన్నారు. ప్రచారంలో తెర్లాం మండల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్ధి బొమ్మి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎంపీపీ నర్సుపల్లి ఉమాలక్ష్మి, లోచర్ల ఎంపీటీసీ అభ్యర్థి మర్రాపు శంకరరావు, పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు జగన్నాథం, గర్భాపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.


