–8లో
పెద్దగెడ్డ గేటు మొరాయింపు
వర్షాలు తగ్గుముఖం పట్టినా పెద్దగెడ్డ జలాశయం గేటు మొరాయించడంతో నీటి విడుదల కొనసాగుతోంది.
వైద్య ఖర్చులొస్తే అప్పులే దిక్కు
నెలవారీ ఖర్చులన్నీ ముందే లెక్క వేసుకుని జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఇంటి అవసరాలకు డబ్బులు సరిపోకపోతే కొంత కాలం సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ అనారోగ్యం వస్తే మందులు, పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు తప్పవు. అలాంటి సమయంలో చేతిలో పొదుపు లేకపోతే అప్పు చేయాల్సి వస్తుంది. నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు వైద్య ఖర్చులు మరింత భారంగా మారుతున్నాయి.
– కోరాడ ఈశ్వరరావు, దిగువ మధ్యతరగతి కుబుంబ సభ్యుడు, విజయనగరం
జీతం అదే... ఖర్చులు రెట్టింపు
జీతం పెరిగితే కుటుంబం కొంత ముందుకు వెళ్తుందని ఆశించాం. కానీ జీతం పెరుగుదల కంటే ఖర్చుల పెరుగుదలే ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల చదువు, ప్రయాణ ఖర్చులు పోను చేతిలో మిగిలేది చాలా తక్కువ. గతంలో కొంత పొదుపు చేసేవాళ్లం. ఇప్పుడు నెలాఖరుకు డబ్బులు సర్దుబాటు చేసుకోవడమే పెద్ద పనిగా మారింది.
– పిన్నింటి అప్పలనాయుడు,
మధ్యతరగతి ఉద్యోగి, విజయనగరం
హామీలకు, వాస్తవ ఖర్చులకు పొంతనేది?
ఎన్నికల సమయంలో సామాన్యుల జీవన వ్యయాన్ని తగ్గిస్తామని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీరా చూస్తే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల జనానికి భారంగా మారింది.
– వారణాశి సుందరరావు, పౌరుడు, విజయనగరం
కూలి డబ్బులన్నీ ఖర్చులకే...
రోజూ కూలిచేసిన డబ్బులు ఖర్చులకే సరిపోతున్నాయి. పనిలేని రోజుల్లో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్ధం కావడం లేదు. పిల్లల అవసరాలు, మందుల ఖర్చులు అదనపు భారంగా మారాయి. కూలి పెరిగినా సరుకుల ధరలు కూడా పెరిగిపోవడంతో మా జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. – వల్లంకి ఎర్నినాయుడు,
రోజువారీ కూలీ, విజయనగరం
హోటల్ వ్యాపారానికి ధరల సెగ
బియ్యం, వంటనూనె, గ్యాస్, కూరగాయల ధరలు పెరగడంతో హోటల్ నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ధరలు పెంచితే వ్యాపారం పడిపోతోంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పూసర్ల సతీష్,
హోటల్ యజమాని, విజయనగరం
పడిపోయిన వ్యాపారం
పండగలు, శుభకార్యాల సమయంలో బట్టలు, అలంకరణ వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోళ్లు పెరుగుతాయని ఆశిస్తాం. ఖర్చులు పెరగడంతో అవసరమైన వస్తువుల కొనుగోలుకే జనం ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యాపారాలు సాగడంలేదు. సరుకులు తెచ్చేందుకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం లేదు. ధరల పెరుగుదల ఇంటి బడ్జెట్‌కే కాదు, చిన్న వ్యాపారుల ఉపాధినీ దెబ్బతీస్తోంది.
– చిత్రపురి అప్పారావు,
చిరు వ్యాపారి, విజయనగరం
విజయనగరం అర్బన్:
నిత్యావసరాల ధరల పెరుగుదల జిల్లాలోని సామాన్య కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కూరగాయల నుంచి పప్పులు, నూనెల వరకు రోజువారీ అవసరాల కోసం ఖర్చు పెరుగుతుండటంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలు.. ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆదాయం పెరగకపోగా.. మరోవైపు మార్కెట్‌లో ధరలు అదుపుతప్పుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
● రెండున్నరేళ్లలో ధరలు రెట్టింపు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా నిత్యావసరాల ధరల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి తగ్గుదల వంటి కారణాలు ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం సామాన్యులపై పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024కు ముందు ఉన్న ధరలకు, ప్రస్తుత ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,400 నుంచి రూ.2,200– 2,400కు చేరింది. పాలు లీటరు రూ.44 నుంచి రూ.59కి, పంచదార కిలో రూ.40 నుంచి రూ.75, కందిపప్పు రూ.110 నుంచి రూ.170కి పెరిగింది. కోడిగుడ్డు ధర రూ.5 నుంచి రూ.7, పెట్రోల్ రూ.109 నుంచి రూ.118, డీజిల్ రూ.94 నుంచి రూ.104, టమాటా ధర రూ.20 నుంచి రూ.45, మినపప్పు ధర రూ.120 నుంచి రూ.145 అయ్యింది. ఉల్లిపాయలు, శనగపప్పు, చింతపండు.. ఇలా ఏ ధర చూసుకున్నా రెట్టింపు అయ్యింది. వంటనూనె 15 కిలోల టిన్ ధర రూ.2,000 నుంచి రూ.2,800కు పెరిగింది. చికెన్ కిలో రూ.180 నుంచి రూ.300కు, మాంసం రూ.800 నుంచి రూ.1,000కు చేరాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.820 నుంచి రూ.950కి పెరిగింది.
● పేదల పళ్లెంలో తగ్గుతున్న పోషకాహారం
ధరల పెరుగుదల ప్రభావం కేవలం కుటుంబ ఖర్చులకే పరిమితం కావడం లేదు. ఆదాయం సరిపోకపోతే పప్పులు, పాలు, పండ్లు, నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, గిరిజన గ్రామీణ కుటుంబాలపై ఈ భారం అధికంగా పడుతోంది. పౌష్టికాహారానికి అవసరమైన వస్తువులనే కొనలేని పరిస్థితి ఏర్పడితే కుటుంబాల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ధరల నియంత్రణ అనేది కేవలం మార్కెట్ వ్యవహారం కాదు.. ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడిన అంశం. ధరల పెరుగుదలకు కారణాలను గుర్తించడం, సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడం, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవడం, అవసరమైన వస్తువులను సరసమైన ధరలకు అందించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ప్రజలకు కావాల్సింది హామీలు కాదు.. వంటింటి ఖర్చును తగ్గించే ఆచరణాత్మక చర్యలు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఉపశమనం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చేతిలో డబ్బులు లేక.. మరోవైపు నిత్యవసరాల ధరల మోతతో చిరు బతుకులు ఛిన్నాభిన్నమవుతున్నాయి
కరోనా కాలంలోనూ ఆదుకున్న జగన్ ప్రభుత్వం
కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆ క్లిష్ట సమయంలోనూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగమోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ.. నేటి ప్రభుత్వం ధరల నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నాయి. ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు ప్రభుత్వ నియంత్రణలో లేకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించే ముందస్తు ప్రణాళికలు, మార్కెట్ పర్యవేక్షణ మాత్రం పాలక యంత్రాంగం చేతుల్లోనే ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం ఉందనే కారణంతో ప్రతి వస్తువు ధర పెరుగుదలను సమర్థించలేమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.
ధరల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
అందని సంక్షేమ పథకాలు...
ఆవేదనలో జనం
కిలో బియ్యం రూ.90 పలుకుతున్న వైనం
పెరిగిన వంటింటి బడ్జెట్


