● నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
● ప్రభుత్వం తీరుపై శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం
చీపురుపల్లిరూరల్ (గరివిడి): నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయని, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని కోరారు. గరివిడి మండలం కోడూరు, దువ్వాం, తోండ్రింగి గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తరఫున గురువారం ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజితతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. 25 కిలోల బియ్యం ప్యాకెట్ ధర రూ.2వేలు దాటితే భవిష్యత్తులో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రామాల్లోనికి ప్రచారానికి వచ్చే టీడీపీ నాయకులను ధరల పెరుగుదలపై ప్రజలే నిలదీయాలన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలన్నారు. ఆడబిడ్డనిధి, నిరుద్యోగభృతి, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, సంక్షేమ పథకాలకు మంగళం పాడేయడంపై గట్టిగా అడగాలన్నారు. రెండున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత, ఎంపీటీసీ అభ్యర్థులు గేదెల అన్నాలు, మీసాల విశ్వేశ్వరరావు, రెడ్డి గోవింద్, పార్టీ నాయకుడు బొత్స సందీప్, మాజీ సర్పంచ్ గేదెల కృష్ణవేణి, వైఎస్సార్‌సీపీ నాయకులు గేదెల ఆదినారాయణ, గేదెల శంకరరావు, ఎలకల అప్పలనాయుడు, గవిడి సన్యాసి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


