● జనసేన ఎస్.కోట నియోజకవర్గ
ఇన్‌చార్జి వబ్బిన సత్యనారాయణ
శృంగవరపుకోట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్ల సర్దుబాటులో కూటమి ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడిచారని, రాజకీయకుట్రతో జనసేన నాయకులు, కార్యకర్తలను మోసం చేశారని ఎస్.కోట జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వబ్బిన సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్.కోటలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నాయకులు బరిలో నిలిచి మిత్ర ధర్మాన్ని విస్మరించారన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, విశాఖపట్నం పార్లమెంట్ పరిధి జనసేన నాయకులు తమ భాద్యతలను విస్మరించారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక నాయకులతో మాటమాత్రం చెప్పకుండా, పార్టీ భవిష్యత్‌ను తాకట్టు పెట్టేయడం అన్యాయమన్నారు. జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను బరిలో దించడమంటే వెన్నుపోటు పొడిచినట్లేనని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను నిలువునా ముంచేశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం దక్కడంలేదన్నారు. జనసేన శ్రేణులకు జరుగుతున్న అన్యాయాలపై పార్టీ అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్ స్పందించాలన్నారు. సమావేశంలో వేపాడ, శృంగవరపుకోట, ఎల్.కోట మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, సుంకరి అప్పా రావు, సేనాపతి వెంకటేష్, రుద్ర నాయుడు, దొగ్గ రమణ, మించిన దొర, పట్రాయని రవి, యలమంచిలి దేవుడు, సీతంపేట రాము, పిల్లా రామదుర్గ తదితరులు పాల్గొన్నారు.


