● పురవీధుల్లో పూజారి రూపంలో
పైడితల్లి విహారం
● మధ్యాహ్నం 3 గంటలకే
ప్రారంభమైన సిరిమాను తిరువీధి
● అర్నబ్ తుఫాన్‌తో తగ్గిన భక్తులతాకిడి
● రాష్ట్ర ప్రభుత్వం తరఫున
పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
● అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
● విపక్షనేతపై ఎందుకీ వివక్ష..?
విజయనగరం:
మంగళ వాయిద్యాలు.. భక్తుల భజనలు... జై పైడిమాంబ.. జై జై పైడిమాంబ జయజయ ధ్వానాల నడుమ విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి సిరిమాను సంబరం మంగళవారం ప్రశాంతంగా సాగింది. సిరిమాను పూజారి రూపంలో దర్శనమిచ్చిన సిరులతల్లికి భక్తులు ప్రణమిల్లారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి కురిసిన జోరువానలోనే సిరిమాను తిరువీధి సాగింది. జిల్లా యంత్రాంగం ముందుస్తుగా నిర్ణయించిన సమ యం ప్రకారం పూజారి బంటుపల్లి వెంకటరావు మధ్యాహ్నం 2.38 గంటలకు సిరిమానును అధిరోహించగా.. 2.55 గంటలకు సిరిమాను రథం కదిలింది. పాలధార ముందు కదలగా తెల్ల ఏనుగు, బెస్తవారి వల, అంజలి రథం సిరిమాను వెంట సాగాయి. అమ్మవారి చుదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమాను తిరువీధి డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేసింది. అనంతరం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది.
● పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి సతీసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజాక్రతువులు పూర్తిచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలు సమర్పించారు. శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
● సిరిమానోత్సవంలో ప్రముఖులు
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధాగజపతి, ఊర్మిళా గజపతి, ఇతర రాజకుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజుపై నుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి తమ కుటుంబంతో కలిసి పాత అర్బన్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఉత్సవాన్ని తిలకించారు. వాస్తవానికి వీరంతా ప్రతి ఏడాది అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను ఉత్సవం ప్రారంభం నుంచి పూర్తియ్యేంత వరకు వేచి ఉండగా.. ఈ ఏడాది భారీ వర్షం... ఈదురుగాలుల నేపధ్యంలో మొదటి సారి సిరిమాను తిరిగి వచ్చే సరికి ఆయా వేదికల నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఉత్సవంలో ముందు ఉండే సన్నాయి మేళం కూడా ఈ ఏడాది వర్షం కారణంగా ఏర్పాటు చేయలేదని అధికారులు చెబుతున్నారు.
ఉదయం రాజకీయ ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చారు. అందరినీ నేరుగా పంపించిన ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణకు దర్శనం కల్పించడంలో కూడా వివక్ష చూపారు. దర్శనానికి వచ్చిన ఆయనను సుమారు పదినిమిషాల పాటు నీరక్షింపజేసిన అనంతరం బారికేడ్లు ఓపెన్ చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు పంపించారు.
సిరులతల్లి సిరిమాను జాతర ఓ వైపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో చదురుగుడిలో పైడితల్లికి వేదపండితులు లక్షపుష్పార్చన సేవను నిర్వహించారు. ఆలయమంతా వేదమంత్రోచ్ఛారణతో మార్మోగింది. జై పైడిమాంబ జైజై పైడిమాంబ నినాదాలతో భక్తజనం లక్ష పుష్పార్చన సేవలో తరించారు.


