● 16వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఐదు గేట్లు ఎత్తి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు అధికారులు తెలిపారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 3వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద ఐదు గేట్లు ఎత్తివేసినట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 63.73 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తివేస్తామన్నారు.
పార్టీ గుర్తు కోల్పోయిన కూటమి అభ్యర్థులు
సంతకవిటి: మండలంలోని మిర్తివలస ప్రాదేశికం స్థానంలో టీడీపీ అభ్యర్థుల మధ్య వర్గపోరు స్వతంత్రులుగా మిగిల్చింది. ఇక్కడ టీడీపీ బీ–ఫారం ఆశిస్తూ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు పార్టీ నాయకులు ఎవరిపేరు రాయకుండా ఖాళీ బీ–ఫారంను ఆర్‌ఓకు అందజేశారు. గడువులోగా అభ్యర్థిని తేల్చుకోవాలని సూచించారు. అయితే, పార్టీ అభ్యర్థిని నిర్ణయించలేకపోవడం, నామినేషన్లు ఉపసంహరించకపోవడంతో ఇద్దరినీ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే స్థానంలో జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేసిన పైడి గోవిందరావుకు కూడా పార్టీ నుంచి బీ–ఫారం అందకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడి ముగ్గురు కూటమి అభ్యర్థులకు పార్టీ గుర్తు రాకపోకవడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీలోకి పెదమానాపురం వాసులు
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పలువురు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎంపీటీసీ అభ్యర్థి రౌతు రాజేశ్వరి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. రెండున్నరేళ్లు పాలనలో ప్రజలకు టీడీపీ చేసింది శూన్యం అని గ్రహించి గ్రామానికి చెందిన వై.జోజి, కె.గురమ్మ, జి.సూర్యనారాయణ, కె.శ్రీను, జి.హరీష్, దిలీప్, జి.మధు, జి.సతీష్ పార్టీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీలో చేరామని, ఎంపీటీసీగా రాజేశ్వరిని, జెడ్పీటీసీగా మంత్రి అప్పలనాయుడును గెలిపించుకుంటామన్నారు.


