తొందరపడి చిక్కుల్లో పడొద్దు.. | - | Sakshi
Sakshi News home page

తొందరపడి చిక్కుల్లో పడొద్దు..

Oct 28 2026 6:06 AM | Updated on Oct 28 2026 6:06 AM

రాజాం సిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీని దృష్ట్యా పార్టీలకు అతీతంగా పోస్టులు పెట్టడం వంటివి చేయవద్దంటూ గ్రామాల్లో పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి సమాజంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగామ్‌ ఇలా తమకు అనుకూల వేదికలపై ప్రజలు వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సోషల్‌ మీడియాలో పుట్టుకొచ్చే పోస్టులు వందలు, వేల మందిని ప్రభావితం చేస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేయడం పరిపాటి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరూ అసభ్యకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టవద్దంటూ పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కుల, మత, రాజకీయ, ప్రాంతీయ విభేదాలు, వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియాల్లో పోస్టు, కామెంట్‌లు పెట్టే ముందు షేర్‌ చేసేటప్పుడు ఆలోచించి, వాస్తవాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచి పద్దతి. లేదంటే ఎవరైనా సరే ఇబ్బందులు పడకతప్పదు. ముఖ్యంగా దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుల, మత ద్వేషాలు సృష్టించే సందేశాలు ఫార్వర్డ్‌ చేయకూడదు. నిబంధనలు మీరి ఫార్వర్డ్‌ చేస్తే గ్రూపు అడ్మిన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

హద్దు మీరితే..

అసభ్యకర ఫొటో, వీడియో, సమాచారం షేర్‌ చేస్తే ఐపీసీ సెక్షన్‌ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్‌ ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. రెండో సారి ఇదే నేరానికి పాల్పడితే ఐదేళ్లు శిక్షార్హులు. ఓ మతాన్ని కించపరుస్తూ పోస్ట్‌, కామెంట్‌ చేస్తే ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్‌ 295 కింద కేసు నమోదు చేస్తారు. నకిలీ ఖాతాలు సృష్టించడం నేరం. ఇలా చేస్తే ఐపీసీ సెక్షన్‌ 499, ఐటీ చట్టంలో సెక్షన్‌ 66డి కింద శిక్షార్హులు అవుతారు. అనుమతి లేకుండా ఇతరుల ఫొటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినా, వాడినా ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్‌ 499 కింద కేసు నమోదు చేస్తారు. చీటింగ్‌ కేసు నమోదుకు ఆస్కారం ఉంది. మహిళలపై అసభ్యకర పోస్ట్‌లు, కామెంట్‌లు చేస్తే ఐటీ చట్టం సెక్షన్‌ 66, ఐపీసీ 292, 354ఎ, 354 డి (నిర్బయ చట్టం) కింద శిక్షార్హులు. నిరాధారమైన విషయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, కించపర్చేలా ఉండే పోస్టులు, వార్తలు, ఫొటోలు పోస్ట్‌ చేస్తే ఐపీసీ సెక్షన్‌ 505 కింద నాన్‌బెయిల్‌బుల్‌ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పవు.

రెచ్చగొట్టే వాఖ్యలు, అసభ్యకర పోస్టులు, కామెంట్లు వద్దేవద్దు

సోషల్‌ మీడియాలో ఏదిపడితే

అది షేర్‌ చేయొద్దు

గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement