● నేడు పైడితల్లి సిరిమానోత్సవం
● మధ్యాహ్నం 3 గంటలకే ఉత్సవాన్ని ప్రారంభించేలా ప్రణాళికలు
● మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా
● పండగ శోభను సంతరించుకున్న విజయనగరం జిల్లా కేంద్రం
● 10వ సారి సిరిమాను అధిరోహించనున్న బంటుపల్లి వెంకటరావు
● ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు
సాక్షిప్రతినిధి విజయనగరం:
ఉత్తరాంఽధ్రుల ఆరాద్యదైవం... విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్స వాల్లో కీలక ఘట్టమైన సిరిమాను సంబరానికి సమయం ఆసన్నమైంది. రెండున్నర శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. సంప్రదాయ బద్దంగా సోమ వారం తొలేళ్ల ఉత్సవం భక్తజన సందోహం నడుమ జరిగింది. సిరిమాను సంబరాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తజనం ఇప్పటికే విజయనగరం చేరుకుంది.
ప్రతి ఇల్లు పండగ శోభతో కళకళలాడిపోతోంది. సిరిమాను సంబరాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభించి సాయంత్రం 5 గంటలకే ముగించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుండగా... ఉదయం 10 గంటలకే హుకుంపేట నుంచి అమ్మవారి చదరగుడి వద్దకు సిరిమాను, ఇరుసుమానును తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. పండగ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
● అమ్మవారి కరుణ కోసం..
ఒకప్పుడు గ్రామదేవత అయిన పైడితల్లి ఇప్పుడు అందరి దేవత. పైడితల్లి కీర్తి ఎల్లలు దాటింది. పసిడితల్లి కరుణాకటాక్షాల కోసం ఎక్కడెక్కడివారో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడులాంతర్లు, రాజాబజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. సిరిమానోత్సవం విజయవంతమయ్యేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిరిమానోత్సవంలో ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఈ ఏడాది 10వ సారి సిరిమానును అధిరోహించనున్నారు. రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా.
● అన్నీ రసవత్తర ఘట్టాలే....
భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో అన్నీ రసవత్తర ఘట్టాలే. 55 అడుగుల పొడువున్నా సిరిమాను ఉపరితలంతో బిగించే ఇరుసుపై ప్రధాన పూజారి ప్రధాన పూజారి వెంకటరావు విసనకర్ర చేతబట్టి ఆశీనులవుతారు. రెండో చివర రథంపై అమర్చిన ఇరుసుమానుకు అమరుస్తారు. దాని ఆధారంగానే మాను పైకిలేస్తుంది. గజపతిరాజ వంశీయులు తరఫున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు తిరుగుతుంది. ఊరేగింపు ఆద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలుస్తారు.
● అత్యంత నియమ నిష్టలతో...
అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండే సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు హుకుంపేటలోని మధ్యాహ్నం 10 గంటలకు బయలుదేరుతారు. కాలినడకన వేలాది మంది భక్తుల సందడితో ఊరేగింపుగా వస్తారు. దారిపొడుగునా ప్రజలు పూజారి రూపంలో ఉన్న అమ్మవారి పాదాలపై పసుపునీళ్లు పోసి దీవెనలు అందుకుంటారు. చంటిపిల్లలపై నుంచి పూజారి దాటితే వారికి మేలు జరుగుతుందన్న నమ్మకంతో చాలామంది ఆయనవచ్చే దారిలో వారిని నేలపై ఉంచుతారు. పూజారి చేరుకున్నాకే సిరిమానోత్సవం ప్రారంభమవుతుంది. 260 ఏళ్ల చరిత్ర కలిగిన సిరిమాను చదురుగుడి నుంచి మహారాజ కోట వరకూ మూడు పర్యాయాలు తిరిగి భక్తులను ఆశీర్వదించనుంది. సిరిమాను ముందుండే బెస్తవారి వల, పాలధార, తెల్లఏనుగు, అంజలిరథాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి.


