నేడు నామినేషన్ల ఉపసంహరణ | - | Sakshi
Sakshi News home page

నేడు నామినేషన్ల ఉపసంహరణ

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

● ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల తుదిజాబితా ప్రకటన

విజయనగరం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియనున్నది. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి 258 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన సమయంలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లను పలు కారణాలతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు. 254 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే, జిల్లాలోని 27 మండలాల్లో 449 ఎంపీటీసీ స్థానాలకు 2,577 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన ప్రక్రియలో 66 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 2,511 నామినేషన్లు ఆమోదించారు.

ఉద్దేశపూర్వకంగానే నామినేషన్‌ తిరస్కరణ

● రూల్స్‌ గాలికొదిలేసి కూటమి నేతల చెప్పుచేతల్లో అధికారులు

● కోర్టులో తేల్చుకుంటాం బొత్స చైతన్య

విజయనగరం గంటస్తంభం: ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన అధికారులే పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తూ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. సిరి సహస్ర నామినేషన్‌ ఆమోదంపై ఈసీ అధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. బీసీ సర్టిఫికేట్‌ ఉంది కాబట్టే నామినేషన్‌ ఆమోదించామని చెబుతున్న అధికారులు, ఇతర లోపాలపై మాత్రం సమాధానం చెప్పలేక మిన్నకుంటున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టులో తేల్చుకోవాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం వారి ద్వంద్వనీతికి నిదర్శనంగా మారింది. మరోవైపు, వైఎస్సార్‌సీపీ తరఫున పూసపాటిరేగ జెడ్పీటీసీ బరిలో నిలిచిన బొత్స చైతన్య నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్టోబర్‌ 15వ తేదీనే ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని బొత్స చైతన్య ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌ వేయడానికి ముందు వరకు అవకాశం ఉన్నా పరిగణనలోకి తీసుకోకుండా, కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తూ నామినేషన్‌ను తిరస్కరించారని వాపోయారు. అధికారుల పక్షపాత ధోరణిపై న్యాయపోరాటం చేస్తామని, ఎన్నికల ట్రిబ్యునల్‌, కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.3లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు బొబ్బిలికి చెందిన భక్తులు సోమవారం రూ.3 లక్షల విరాళం సమర్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన చనమల్ల కనకరాజు, కమల కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ పర్యవేక్షకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement