విజయనగరం గంటస్తంభం:
రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో నూతన జోన్లు, జిల్లాల పేరుతో 90 శాతం నుంచి 95 శాతం వరకు స్థానిక రిజర్వేషన్లు విధించడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుబడిన ప్రాంతాల అభ్యర్థులు, నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ చూపే అవకాశాలు కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీజీఈఏ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కంటోన్మెంట్‌లోని యూత్ హాస్టల్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన నేపథ్యంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, వాటి అమలును ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొచ్చిన ఆర్టికల్ 371(డి) పరిధిని మించి, ప్రస్తుత పరిస్థితులకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో సర్వీసులో చేరి ఇప్పటికే సీనియారిటీ, పదోన్నతులు పొందిన ఉద్యోగులపై ఈ నూతన నిబంధనలను వెనుకటి తేదీల నుంచి (రెట్రాస్పెక్టివ్‌గా) అమలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయ సమీక్ష కోరనున్నట్లు వెల్లడించారు. సమాజంలో, ఉద్యోగుల్లో విస్తృత చైతన్యం తెచ్చేందుకు దసరా శరన్నవరాత్రుల ప్రారంభ రోజైన అక్టోబర్ 12 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేధావులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలతో కలిసి జాగో ఆంధ్ర పేరిట చర్చా వేదికలు నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కూనపురెడ్డి శ్రీనివాస్, యుగంధర్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, జిల్లా శాఖ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విభజన ప్రాతిపదిక రిజర్వేషన్లతో నష్టం
రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తాం
ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
కె.ఆర్.సూర్యనారాయణ వెల్లడి


