వేపాడ: మండలంలోని బల్లంకి గ్రామ న్యూ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ వేలంపాటను సోమవారం రాత్రి నిర్వహించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బల్లంకి వరలక్ష్మికనకరాజు రూ.1,55,000కు లడ్డూను సొంతం చేసుకున్నారు.
తెడ్డుకోసం నదిలో దూకిన వ్యక్తి గల్లంతు
వీరఘట్టం: మండలంలోని పనసనందివాడ వద్ద నాగావళి నదిలో పడవ నడుపుతున్న పాలకొండ సుబ్బారావు (55) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఆయన ప్రతిరోజు పనసనందివాడ నుంచి రేగిడి మండలం కందిస గ్రామాలకు మధ్య నాగావళి నదిలో పడవ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో కందిస గ్రామానికి పడవలో తీసుకెళ్లాలని ఓ ముగ్గురు వ్యక్తులు సుబ్బారావును కోరారు. వెంటనే సుబ్బారావు తన మిత్రడు నాగుడు సహాయంతో పడవను తీయగా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో తెడ్డులతో నాగావళి నదిలో పడవను నడుపుతూ ప్రయాణికులను కందిస తీరానికి చేర్చాడు. ఇంతలో తన చేతిలో ఉన్న తెడ్డు నదిలో జారి పడి కొట్టుకు పోయింది. వెంటనే తెడ్డు కోసం సుబ్బారావు నదిలోకి దూకాడు. తెడ్డుతో పాటు సుబ్బారావు కూడా కనిపించకుండా పోయాడు. ఎస్సై షణ్ముఖరావు ఆర్‌ఐ వి.రవితేజ పనసనందివాడ గ్రామానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.


