● ఎమ్మెల్యే కోండ్రు మురళీని నిలదీసిన రైతులు
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
రాజాం: రేగిడి మండలం ఖండ్యాం, సంతకవిటి మండలం జావాం గ్రామాల మధ్య నాగావళి నదిలో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రీచ్‌ల వల్లే తమ పంటపొలాలు వరద ముంపునకు గురయ్యాయని ఖండ్యాం గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 28న రేగిడి మండలం ఖండ్యాం వద్ద ముంపునకు గురైన పంటపొలాలను పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ను నిలదీసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంటలు ముంపునకు గురికావడం, ఖండ్యాం రోడ్డు కొట్టుకుపోవడానికి నదిలోని ఇసుక తరలింపునకు వేసిన రోడ్డే కారణమని రైతులు వాపోయారు. రీచ్‌లను తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేయగా, ఎమ్మెల్యే అక్కడ నుంచి జారుకున్నారు. పంటల పరిశీలనకు ఏ ఒక్క అధికారి రాలేదని రైతులు ఆరోపించగా, అధికారులకు చెబుతానులే అంటూ అక్కడి నుంచి ఎమ్మెల్యే నిష్క్రమించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో సాగుతున్న ఇసుక అక్రమ రీచ్‌లపై స్థానికుల ఆగ్రహాన్ని బయటపెట్టింది.


