● కోరం ఉంటే ఎన్నికల ఎలా వాయిదా వేస్తారంటూ నిలదీత
● పాఠశాల గేటువద్ద బైఠాయింపు
రామభద్రపురం: మండలంలోని రొంపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో కోరం ఉన్నా ఎంఈఓ ఎన్నిక వాయిదా వేయడంపై తల్లిదండ్రులు భగ్గుమన్నారు. ఇక్కడి పాఠశాలలో 57 మంది పిల్లలు చదువుతున్నారు. ఎస్‌ఎంసీ ఎన్నిక కోసం 57 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉదయం 12 గంటల వరకు 12 మంది డైరెక్టర్లకు ఏడుగురిని ప్రశాంత వాతావరణంలో ఎన్నుకున్నారు. 8వ డైరెక్టర్ ఎన్నిక సమయంలో అధికార పార్టీ నాయకులు రాద్ధాంతం చేశారు. దీంతో హెచ్‌ఎం జేపీడీ రాజుతో సంప్రదించకుండానే ఎంఈఓ తిరుమలప్రసాద్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 30 మంది పైబడి ఉన్నా ఎన్నిక ఎలా వాయిదా వేస్తారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎన్నిక నిర్వహించకపోతే పిల్లలకు టీసీలు ఇచ్చేయాలంటూ స్కూల్ గేటు ముందు బైఠాయించారు. ఎంఈవో ఓ టీడీపీ నాయుకుడిలా వ్యవహరిస్తూ ఎన్నిక వాయిదా వేశారని ఆరోపించారు. మాకు న్యాయం చేయకపోతే ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. విషయాన్ని హెచ్‌ఎం రాజు డీఈఓకు తెలియజేశారు. ఎంఈఓ తీరువల్ల ఇరుక్కుపోయానంటూ కన్నీరుపెట్టారు.


