నెల్లిమర్ల రూరల్: ప్రజలకు సురక్షితమైన ఔషధాలను అందించాల్సిన బాధ్యత వైద్యులు, ఫార్మసిస్టులపై ఉందని సెంచూరియన్ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి అన్నారు. ఈ మేరకు మండలంలోని టెక్కలి సెంచూరియన్‌లో ప్రపంచ ఫార్మసీ వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైద్యుల సూచన లేకుండా మందులను వినియోగించడం, మోతాదు కు మించి ఔషధాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బొబ్బిలి జోన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టుల సాధికారిత అంశాన్ని ఈ ఏడాది వారోత్సవాల ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నామన్నారు. ప్రజలకు మందుల వినియోగంపై ఫార్మసిస్టులు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ చందన్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
సెంచూరియన్ వీసీ ప్రశాంత్ కుమార్


