విజయనగరం: పారా రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల కోసం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె. దయానంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గల ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికలకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పారా స్విమ్మర్లు హాజరయ్యారు. ఒక్కో కేటగిరికి ఒక్కొక్కరే హాజరు కావడంతో 11 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వారంతా అక్టోబర్ 5 న విజయవాడలోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8 వ పారా స్విమ్మింగ్ చాంపియన్ షిప్–2026 లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారుడు కొత్తింటి పైడిరాము, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి. కళ్యాణి, ప్రదీప్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


