అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలి

● రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికారత మంత్రి కొండపల్లి

విజయనగరం టౌన్‌: ఎపీఎస్పీ విభాగంలో స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా ఎంపికై , జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుల్స్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ మంగళవారం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలల కఠోర శిక్షణ మీ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు. అన్నిరంగాల్లోనూ సుశిక్షితులైన పోలీసు కానిస్టేబుళ్లుగా విధులను నిర్వహించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. అసాంఘిక శక్తులతో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ మాట్లాడుతూ పరిపూర్ణమైన పోలీసులుగా రాష్ట్ర పోలీసుశాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల పాత్ర తగ్గినప్పటికీ, పోలీసుశాఖకు సైబర్‌ నేరాల రూపంలో మరో సవాల్‌ ఎదురవుతోందన్నారు. కార్యక్రమంలో డీపీటీసీ ప్రిన్సిపాల్‌, ఎస్పీ అడ్మిన్‌ పి.సౌమ్యలత, ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వి.మాధవ్‌రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘువర్మ, కావలి గ్రీష్మ, గాదె శ్రీనివాసులునాయుడు, 16వ బెటాలియన్‌ కమాండెంట్‌ అనిల్‌కుమార్‌ పులిపాటి, మైరెన్‌ ఎస్పీ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

మీడియాకు నో ఎంట్రీ

మీడియాకు ఇన్విటేషన్‌ ఇచ్చిన జిల్లా పోలీసుశాఖ తీరా పరేడ్‌ గ్రౌండ్‌లో ఒక ప్లేస్‌ ఇచ్చి అక్కడ కూర్చుని కవరేజ్‌ చేయాలని ఆదేశించారు. చుట్టూ ఎస్‌ఐ స్ధాయి అధికారులతో పాటూ మహిళా పోలీసులను నిలువరించి కవరేజ్‌ చేయడానికి వీలుగా లేకుండా చేయడం పట్ల జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాచార శాఖ అధికారులకు ఇదే పరిస్థితి ఎదురుకావడంతో వారు చేసేదిలేక వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement