● ఎనిమిదో రోజుకు చేరిన జంజావతి సాధన సమితి దీక్షలు
పార్వతీపురం రూరల్: జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22న ప్రారంభమైన ఈ దీక్షలకు మద్దతు పెరుగుతోంది. ఎనిమిదో రోజు దీక్షల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రైతులు, మహిళలు, స్థానికులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ దీక్షా శిబిరానికి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రముఖ సామాజిక వేత్త యాళ్ల మల్లేష్ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. జంఝావతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర మొత్తానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయకపోవడం మన్యం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. ఇందులో భాగంగా ఏడో రోజున కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా వినతిపత్రం అందజేశామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా ప్రజల భవిష్యత్తు, తాగు, సాగునీటి అవసరాలు జంఝావతి ప్రాజెక్టు పైనే ఆధారపడి ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.


