బొబ్బిలి: గుంతల రహదారి ఉన్నతమైన భవిష్యత్తున్న ఓ యువకుడ్ని బలి తీసుకుంది. పట్టణంలోని గొల్లపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి గొల్లపల్లి సాయి కృష్ణ(సిద్ధు)తన స్నేహితుడితో కలిసి రామభద్రపురం కూరగాయల మార్కెట్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా అక్కడున్న పెద్ద పెద్ద గుంతలు గుర్తించలేక బోల్తా పడ్డారు. ఈ ప్రమాదంలో సాయికృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొల్లపల్లిలో సోమవారం వినాయక అనుపోత్సవాల సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న యువతలో సాయికృష్ణ, వర్రి నానిలు కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలు కోసం అడ్వాన్సులు ఇచ్చేసి రావడానికి వెళ్లారు. అన్ని మాటలూ అయ్యాక తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గొర్లె సీతారామపురం పెట్రోల్ బంక్ నుంచి మెట్టవలస వెళ్లే వరకూ గల సుమారు 300 మీటర్ల రాయగడ వెళ్లే రహదారిలో ఉన్న గుంతలు గుర్తించలేక పోయారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఈ గుంతల్లో పడిపోయారు.సాయికృష్ణ మృతి చెందగా స్నేహితుడు వర్రి నాని గాయాలపాలయ్యాడు. సాయి కృష్ణ తండ్రి రామారావు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఉద్యోగి. తల్లి దాడెమ్మ గృహిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బొబ్బిలి సీఐ కే నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


