గుర్ల: మండలంలోని కోటగండ్రేడు గ్రామం వద్ద గల చంపావతి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. కోటగండ్రేడు పంప్‌హౌస్ వద్ద నదిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి రెండు రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి 40 ఏళ్లు ఉంటాయని, ఎరుపు రంగు బనియన్, బిస్కెట్ కలర్ చొక్కా మోకాళ్ల వరకు ఉండే జీన్స్‌ను ధరించినట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతి ఆత్మహత్య
గజపతినగరం రూరల్: మండలంలోని డోలపాలెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి వాసా దేవి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానికురాలు అయిన వాసా చిలకమ్మ చిన్న కుమార్తె దేవి. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో కడుపునొప్పి తట్టుకోలేక ఈ నెల 25న మోతాదుకు మించి ఐరన్ మాత్రలు మింగేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవి పరిస్థితి విషమించడంతో ఈ నెల 26న సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై ఆదివారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పూసపాటిరేగ: భోగాపురం మండలంలోని సవరవిల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గండిబోయిన రాంబాబు(35) అనే వ్యక్తి కుమారుడు గండిబోయిన సాయిగణేష్‌కి కేన్సర్ సోకడంతో బాధను తట్టుకోలేక ఉరివేసుకున్నట్లు తెలియవచ్చింది. కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడడంతో ఆ బాధను తట్టుకోలేక గ్రామం సమీపంలో గల పీఎస్‌ఎన్ మూర్తికి చెందిన తోటలో నైలాన్ తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడు తోటలో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య సన్యాసమ్మ, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందర పేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


