అక్టోబర్‌ 26, 27 తేదీల్లో..పైడితల్లి పండగ | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 26, 27 తేదీల్లో..పైడితల్లి పండగ

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

అక్టోబర్‌ 26, 27 తేదీల్లో..పైడితల్లి పండగ

● 25,26తేదీల్లో విజయనగరం ఉత్సవాలు

● కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

విజయనగరం క్రైమ్‌ : అక్టోబర్‌ 26, 27 తేదీల్లో పైడితల్లి అమ్మవారి పండగ, 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి వెల్లడించారు. 11 వేదికలు ఏర్పాటు చేసి వైభవంగా విజయనగరం ఉత్సవాలు జరపనున్నట్టు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం పైడితల్లి ఉత్సవం, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. వివిధ శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పైడితల్లి ఉత్సవాలకు సంబంధించి సాధారణ భక్తులు ఇబ్బంది పడని విధంగా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు ఇటీవలె పూర్తయ్యాయని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని, అందుకు తగ్గట్టుగా నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని సిద్ధం చేయాలన్నారు. ఏర్పాట్లలో అమ్మవారి స్ఫూర్తి కనిపించాలన్నారు. లైవ్‌ స్క్రీనింగ్‌ కోసం నాలుగు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. భక్తులకు క్యూలైన్లలో నిరంతరం తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. విజయనగరం ఉత్సవాలకు అక్టోబరు 25న ప్రారంభోత్సవ ర్యాలీతో శ్రీకారం చుడతామన్నారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ భక్తుల రాకకు తగ్గట్టుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఆరు జిల్లాల నుంచి పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లాకు రప్పిస్తామని చెప్పారు. పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు హుండీలు ఎక్కడా ఏర్పాటు చేయకుండా చూడాలని సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు, ఆర్‌డీఓ సుధాసాగర్‌, పైడితల్లి అమ్మవారి ఆలయ ఈఓ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement