సాయం చేద్దామని వచ్చి.. శవమైపోయాడు... | - | Sakshi
Sakshi News home page

సాయం చేద్దామని వచ్చి.. శవమైపోయాడు...

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

సాయం చేద్దామని వచ్చి.. శవమైపోయాడు...

● విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి

● కన్నీరుమున్నీరవుతున్న భార్య, పిల్లలు

తెర్లాం: గ్రామానికి సంబంధించిన విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై శవమైపోయాడు. మండలంలోని అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు(37) శుక్రవారం ఉదయం విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్‌ఐ బి.సాగర్‌బాబు, స్థానికులు తెలిపిన వివరాలు.. అప్పలంపేట గ్రామానికి చెందిన కాబోతుల పోలిరాజు శుక్రవారం ఉదయం చేపలు పట్టడానికి వెళ్తానని భార్య హైమకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. రెండు రోజులుగా అప్పలంపేట గ్రామానికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో గొలుగువలస వద్ద సంబంధిత అధికారులు విద్యుత్‌ పునర్ధురణ పనులు చేపడుతున్నారు. గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి విద్యుత్‌ పునరుద్ధరణ పనులకు సాయం చేసేందుకు పోలిరాజు కూడా వెళ్లాడు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేస్తుండగా ఓ విద్యుత్‌ స్తంభం విరిగిపోయి పనులు చేస్తున్న వైర్లుపై పడిపోయింది. విరిగి పడిపోయిన విద్యుత్‌ స్తంభం వైర్లకు విద్యుత్‌ సరఫరా ఉండడంతో కొత్తగా పనులు చేస్తున్న వైరుకు విద్యుత్‌ సరఫరా జరిగి పోలిరాజు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే విషయం గ్రామస్తుల ద్వారా పోలిరాజు భార్య హైమకు, కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా సంఘటనా స్ధలానికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన పోలిరాజుకు భార్య హైమ, భార్గవి, భావన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కును కోల్పోడంతో తమకు ఇక దిక్కెవరంటూ మృతుని భార్య, కుమార్తెలు విలపిస్తున్న తీరును చూసి పలువురు కంటడిపెట్టారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు సంబంధిత విద్యుత్‌ లైన్‌మేన్‌ ఎల్‌సీ తీసుకోకుండా, విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేయకుండా పనులు చేస్తుండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఓ నిండు ప్రాణం బలైపోయిందని అప్పలంపేట మండిపడుతున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనతో అప్పలంపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుని భార్య హైమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement