ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం | - | Sakshi
Sakshi News home page

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

ఆదాయం ఘనం.. సౌకర్యాలు శూన్యం

● అధ్వానంగా రామభద్రపురం అంతర్రాష్ట్ర మార్కెట్‌

● చిన్నిపాటి చినుకులకే బురదమయం ● ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారాలు

● పరిశుభ్రత పట్టించుకోని పంచాయతీ అధికారులు ● రైతులకు తప్పని ఇక్కట్లు

రామభద్రపురం: జిల్లాలో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన రామభద్రపురం అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు మూలకేంద్రమైన ఈ మార్కెట్‌ నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఆశీల రూపంలో ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కనీస సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. రైతులని చిన్నచూపో.. లేక మట్టి మనుషులని అలుసో.. కానీ పంచాయతీ యంత్రాంగం రైతన్నలకు కనీ సదుపాయాలు కల్పించలేక విఫలమవుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తా,చెదారాలు, కుళ్లిన కూరగాయల వ్యర్థాలే దర్శనిమిస్తున్నాయి. మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలను విక్రయిస్తున్న రైతులతో పాటు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సైతం వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడే పారబోస్తున్నారు. ప్రతిరోజూ శుభ్రం చేయాల్సిన పంచాయతీ కార్మికులు నెలల కొద్దీ తొలగించకపోవడంతో మార్కెట్‌ ఆవరణలో అపరిశుభ్రంగా మారుతోంది. దీంతో రైతులు కూరగాయల తట్ట కిందకు దించలేక.. తలపై ఉంచలేక నానా అవస్థలు పడుతున్నారు. అలాగే కూరగాయలు కొనేందుకు వచ్చిన వ్యాపారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కూరగాయలు, మొక్కజొన్న కంకులు తీసుకొచ్చిన రైతులు అవి చెల్లకపోవడంతో అక్కడే వారాల కొద్ది వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాగే మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు కూడా పాడైన కూరగాయలు అక్కడే పారబోస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యర్థాలు పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. అలాగే ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి.

ఏడాదికి రూ.40 లక్షల ఆదాయం..

దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో ప్రతిరోజూ సుమారుగా రూ.20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. అలాగే రోజూ సుమారు 2 వేల నుంచి 3 వేల మంది రైతులు.. చిన్న, పెద్ద వ్యాపారులు సుమారుగా 100 మంది నిత్యం కూరగాయలు క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మార్కెట్‌ ద్వారా ఆశీల రూపంలో ఏడాదికి పంచాయతీకి రూ.40 లక్షల ఆదాయం వస్తున్నప్పటికీ పరిశుభ్రత పాటించడంలోనూ, కనీస సౌకర్యలు కల్పించడంలో పంచాయతీ అధికారులు, మార్కెటింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది పంచాయతీ పాలకులు సుమారు రూ.20 లక్షల పంచాయతీ నిధులతో సిమెంట్‌ గచ్చు నిర్మించారు. ఆ గచ్చు కూడా కూరగాయల వ్యర్ధాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ ఆకులతో అధ్వానంగా మారింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్‌ను శుభ్రపరిచి, కనీస సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇబ్బందిగా ఉంది..

మార్కెట్‌ అంతా కుళ్లిన వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉడడంతో తలపై ఉన్న కూరగాయల తట్ట నేలపై దించడానికే ఇబ్బందిగా ఉంటోంది. పంచాయతీ అధికారులు రోజువారీ నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మార్కెట్‌ అధ్వానంగా మారింది. ఆశీల వసూలుపై ఉన్న శ్రద్ధ శుభ్రపరచడంలో లేదు.

– కోట చిన్నమ్మతల్లి, కూరగాయల రైతు

దుర్వాసనతో

ఉండలేకపోతున్నాం..

కూరగాయల వ్యర్థాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. మార్కెట్‌లో రోజంతా కూర్చొని కూరగాయలు అమ్ముకోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఈగలు, దోమలు విజృంభిస్తుండడంతో రోగాలు ప్రబలుతున్నాయి.

కన్నమ్మ, చిరు వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement